ప్రగతిభవన్‌లో BRS ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరణ!

by Disha Web Desk 2 |
ప్రగతిభవన్‌లో BRS ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరణ!
X

మొన్నటి వరకు ప్రగతి భవన్‌లో విపక్ష లీడర్లకే ఆంక్షలు ఉండేవి. నేడు అవి గులాబీ ఎమ్మెల్యేలపైనా అమలవుతున్నాయి. గతంలో ఎప్పుడంటే అప్పుడు వెళ్లి సీఎంను కలిసే ఎమ్మెల్యేలు ఇప్పుడు విధించిన ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ‘టికెట్ల గోల’ నుంచి తప్పించుకునేందుకే ప్రగతిభవన్‌లో ప్రవేశాన్ని నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అపాయింట్‌మెంట్ లేకుండా ప్రగతి భవన్‌కు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపేస్తున్నట్టు తెలిసింది. అయితే సెక్రటేరియట్‌కు వచ్చిన లీడర్లను మాత్రం లోనికి అనుమతిస్తున్న ముఖ్యమంత్రి అక్కడే వారితో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి రాక ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమైన లీడర్లకు ప్రగతిభన్‌లో ఫ్రీ ఎంట్రీ ఉండేది. వారు ఎప్పుడొచ్చినా సెక్యూరిటీ సిబ్బంది లోనికి పంపించేవారు. వచ్చిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ విడిగా మాట్లాడి వారి ఆవేదనను వినేవారు. విజ్ఞప్తులు తీసుకునే వారు. కానీ కొన్ని రోజులుగా ప్రగతిభవన్‌లో ఎంట్రీ కోసం ఆంక్షలు పెట్టారని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే కారులో ప్రగతిభవన్‌కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారి కారును గేటు దగ్గరే ఆపేశారు. వివరాలు తమ పై ఆఫీసర్‌కు పంపించారు. సదరు అధికారి అర నిమిషంలోనే గేటు దగ్గరున్న సెక్యూరిటీ‌కి ఫోన్ చేసి వచ్చిన ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ లేదని, వెనక్కి పంపాలని ఆదేశించారు. ‘వారం రోజులుగా అపాయింట్‌మెంట్ ఉన్న వారినే లోనికి పంపాలని ఆదేశాలున్నాయి.’ అని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టికెట్ల గోల కట్టడి కోసమేనా..

ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలపై ఆంక్షలు పెట్టడం వెనక కేసీఆర్ రాజకీయ వ్యూహం దాగున్నదని ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో నెగిటివ్ ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే వారు ఎవరనే విషయంపై ఇంకా నాన్చుడు ధోరణితో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కు విజ్ఞప్తులు ఇచ్చే పేరుతో వచ్చి మళ్లీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ కాళ్లపై పడి రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో విడిగా కలవకూడదని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

పిలిచిన వారికే అనుమతి..

ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలనే ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరెవరికి అపాయింట్‌మెంట్ ఉన్నదో ముందుగానే సెక్యూరిటీ ఆఫీసర్లకు సీఎం పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. అలా పిలిచిన వారితో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా లేదా సెగ్మెంట్‌లో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పార్టీ గెలుపు కోసం ఏం చేయాలి? నెగిటివ్ తగ్గించుకునేందుకు ఏం చేయాలి? కొత్త అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది? అనే అంశాలపై మాట్లాడుతున్నట్టు సమాచారం. కొన్ని సార్లు ఇతర పార్టీలకు చెందిన లీడర్లనూ ప్రగతిభవన్‌కు పిలిచి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

సెక్రటేరియట్‌లోనే దర్శనం

కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రెగ్యులర్‌గా అక్కడికి వస్తున్నారు. అక్కడే ఎక్కువ రివ్యూలు చేస్తున్నారు. సచివాలయంలోనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పంపుతున్నారు. వారందరినీ సీఎం చాంబర్ లోనికి అనుమతిస్తున్నారు. వచ్చిన వారిని ఆ క్షణంలో జరిగే రివ్యూలు, మీటింగ్‌లో కూర్చోమని సీఎం సూచిస్తున్నారు. అయితే విడిగా మాట్లాడేందుకు మాత్రం టైం ఇవ్వడం లేదని, తనే త్వరలో పిలుస్తానని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

మహారాష్ట్ర లీడర్లకు రెడ్ కార్పెట్

మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ లీడర్లకు ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలూ లేవని చర్చ ఉన్నది. వారు ఎప్పుడు, ఎంత మంది వచ్చినా లోనికి అనుమతి ఇస్తున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారు. పార్టీలో చేరేందుకు వచ్చిన లీడర్లలో ఎవరైన ప్రముఖులు ఉంటే వారితో విడిగా భేటీ అవుతున్నట్లు సమాచారం.

Next Story