ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడ్ల పైసలొస్తలేవ్!

by Disha Web Desk 21 |
ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడ్ల పైసలొస్తలేవ్!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు ధాన్యం అమ్ముకోవాలంటే సవాలక్ష రూల్స్ అడ్డొస్తున్నాయి. వరి ధాన్యం కోనుగోలు చేసుకునేందుకు అనేక నిబంధనలు పెడుతున్నాయి. ఈ నిబంధనలతో రైతులకు సకాలంలో నగదు రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో 22 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ రైతు ఆవేదన మాత్రం వారికి అర్థం కావడం లేదు. చేతికొచ్చిన పంట సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వారు నష్టపోతున్నారు. వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో పీఏసీఎస్​ కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక వైపు చేతికొచ్చిన పంటకు తగిన స్ధాయిలో ధర వస్తుందో రాదో... వచ్చిన నగదుతో కూలీల, పెట్టుబడి ఖర్చులకు వస్తాయో రావో అనే అనుమానంతో బిక్కుబిక్కుమంటూ నెట్టుకొస్తున్నారు. ఈ రైతులకు బరోసా కల్పించే నాథుడే లేకపోవడం గమనార్హం.

నగదు చెల్లింపుల్లో జాప్యం
రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. అంతేకాకుండా సేకరించిన ధాన్యానికి 48 గంటల్లో నగదు చెల్లిస్తామని ఢంకా బజాయించి మరీ చెప్పింది. కానీ ధాన్యం సేకరించి రోజులు గడుస్తున్నా నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు సేకరించిన ధాన్యానికి చెల్లించిన నగదుకు పొంతన లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో నమోదు చేసి మ్యానువల్​ రశీదులు ఇవ్వడంలో ఆలస్యమైతుందని అధికారులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆన్​లైన్​లో నమోదు చేసిన ధాన్యానికి కూడా పూర్తిస్ధాయిలో నగదు చెల్లించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1687 మంది రైతుల వద్ద నుండి.. 8079 మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారిక వోపీఎమ్​ఎస్​ ద్వారా నమోదైయింది. కానీ కేవలం 150 మంది రైతులకు రూ.1.53 కోట్లను విడుదల చెసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారుగా రూ.5కోట్ల నగదు చెల్లించాల్సి ఉంది. నమోదైన రైతుల వివరాలకు, చెల్లించిన రైతులకు పోంతన లేదు. నెల రోజులు ముగుస్తున్నప్పటికీ బిల్లుల చెల్లింపులో జాప్యం స్పస్టంగా కనిపిస్తోంది.
22,141 మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ
రైతుల వద్ద 22141.240 మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం గురువారం నాటికి సేకరించారు. ఈ సేకరించిన ధాన్యానికి రూ.45.61కోట్ల నగదు రైతులకు చెల్లించాలని లెక్కలు చేబుతున్నాయి. అయితే ఇందులో కేవలం 1687 రైతుల వద్ద 8079 మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం మాత్రమే సేకరించినట్లు అధికారికంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కంప్యూటర్​లో నమోదు చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యంతోనే రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు చేయడం లేదని వివరిస్తున్నారు. సుమారుగా 14వేల మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం కంప్యూటర్​లో నమోదు చేయకపోవడంతో 2609 మంది రైతులు కోనుగోలు కేంద్రాల చూట్టు తిరుగుతున్నారు.

అందుబాటులోనే గన్నీ బ్యాగులు

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉన్నప్పటికీ.. లేవని ప్రచారం జోరుగా జరుగుతోంది. 11041 మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణకు సరిపడే గన్నీ బ్యాగులు క్షేత్రస్ధాయిలో అందుబాటులో ఉన్నాయి. సకాలంలో వోపీఎంఎస్​లో రైతుల వద్ద సేకరించిన ధాన్యం సేకరించకపోవడంలోనూ జాప్యం జరుగుతోంది. నగదు చెల్లింపు అదే పరిస్థితి.. కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు అకౌంట్లలో జమ చేయడానికి పది రోజుల సమయం పడుతోంది!



Next Story

Most Viewed