రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఎం రియాక్షన్ ఇదే

by Disha Web Desk 2 |
రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఎం రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఘనమని, ఖర్చులు మాత్రం నామమాత్రమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర బడ్జెట్‌పై కామెంట్ చేశారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఎస్‌.వీరయ్య అధ్యక్షతన బడ్జెట్‌పై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో వడ్డీ మాఫీ రూ.22,407 కోట్లు, అప్పు చెల్లింపులు రూ.28,480 కోట్లు చెల్లింపులు ఉన్నాయని తెలిపారు. ఈ చెల్లింపులు మొత్తం బడ్జెట్‌లో 18 శాతానికి పైగా ఉన్నాయని, గృహ నిర్మాణానికి కేటాయించినట్లు ప్రకటించిన రూ.12వేల కోట్లు బడ్జెట్‌లో చూపలేదన్నారు. బడ్జెట్‌లో చూపిన అప్పులు 2024 మార్చి నాటికి రు.3,57,059 కోట్లుగా(రాష్ట్ర స్థూల ఆదాయంలో 23.8శాతం) చూపారని, వాస్తవానికి కార్పొరేట్‌ అప్పులతో సహా లెక్కవేస్తే రాష్ట్ర అప్పులు రూ.4.5 కోట్లకు చేరుకుంటాయని వివరించారు. ఆరోగ్య రంగానికి రూ.11,525 కోట్లు చూపినప్పటికీ అనేకమంది నేటికీ ఆరోగ్యానికి దూరంగానే ఉన్నారని విమర్శించారు. హోంశాఖకు రూ.9,598 కోట్లు కేటాయించినప్పటికీ శాంతిభద్రతల సమస్య ఏమాత్రం మెరుగు పడలేదన్నారు.

మహిళల కిడ్నాపులు, అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతున్నట్లు పోలీస్‌శాఖ నివేదికలు తెల్పుతున్నాయని, కుల దురహంకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు రు.26,831 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో 75శాతం రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా కోసమే కేటాయించారని అన్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు రూ.26,885 కోట్లు కేటాయించినప్పటికీ కాలయాపన వల్ల వాటి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్ళుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సరిగ్గా ఖర్చుచేయకుండా పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి, గిరిజనబంధుకు కేటాయింపు లేదన్నారు. బడ్జెట్‌లో ఏటా 20 శాతం నిధులు రాక, దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీల కేటాయింపులు తగ్గిస్తున్నారని, ఈ తగ్గింపులు లేకుండా దారిద్య్రరేఖ నుంచి ఎగువకు తీసుకురావడానికి, విద్యా-వైద్యానికి అదనపు నిధులు కేటాయించాలని, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed