దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యం: నారాయణ

by Disha Web Desk 12 |
దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యం: నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే సీపీఐ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. అందుకోసమే సీపీఐ గత నెల ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నెల రోజులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో "బీజేపీ హటావ్ - దేశ్ బచావ్" నినాదంతో పాదయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ ప్రజా వ్యతరేక, వినాశకరమైన విధానాలను ప్రజలకు వివరించి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ మూసారాంబాగ్, ఆస్మాన్ గఢ్, టీవీ టవర్, బీ బ్లాక్స్, తిరుమల హిల్స్, వికె దాగే నగర్, బ్యాంకు కాలనీ తదితర బస్తీలు, కాలనీల్లో ఆదివారం "బీజేపీ హఠావో - దేశ్ బచావ్" నినాదంతో సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి పాదయాత్ర నిర్వహించింది.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశమంతా మత విషాన్ని వ్యాపింపజేస్తూ బీజేపీ పార్టీ ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అని హుకుం జారీచేస్తే ప్రజలు ఊరుకోరని కర్ణాటక మాదిరిగానే దేశమంతటా తరమికొడుతారని విమర్శించారు. కర్ణాటకలో మోడీ అమిత్ షా లు ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన బీజేపీ అవమానకరమైన ఓటమి చెందడం సిగ్గుచేటన్నారు. ప్రజలను పేదరికం, వెనుకబాటు నుంచి బయటికి నడిపించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజాన్ని పరిరక్షించడం కోసం ప్రగతిశీల, ప్రజాస్వామ్య వాదులందరు ఏకమై బీజేపీ వినాశకరమైన విధానాలు ప్రజలకు తెలిపి, చైతన్య పరిచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడానికి కృషి చేయాలనీ నారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ, ఆందోజు రవీంద్ర చారి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం, కమతం యాదగిరి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: బోయినపల్లి వినోద్ కుమార్

Next Story