పేదల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు పర్వతరెడ్డి: సీపీఐ నారాయణ

by Disha Web Desk 2 |
పేదల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు పర్వతరెడ్డి: సీపీఐ నారాయణ
X

దిశ, దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై జులై 1951లో కమ్యూనిస్టు పార్టీలో చేరి చివరి వరకు పోరాడిన మహానీయులు కామ్రేడ్ పల్లా పర్వతరెడ్డి అని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం ప్రారంభించి, పేదల పక్షాన నిలిచాడని అన్నారు. శుక్రవారం పట్టణంలో కామ్రేడ్ పల్లా పర్వతరెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమంలో నారాయణ పాల్గొని మాట్లాడుతూ.. నాడు దేవరకొండ ప్రాంతంలో రైతు కూలీల సంఘాలను ఏర్పాటు చేసి, దేవరకొండ ప్రాంతంలో ఉద్యమ సహచరులైన ఉజ్జేని నారాయణ రావు, బొడ్డుపల్లి రామశర్మ, పగిడిమర్రి మల్లప్పలతో కలిసి ఉద్యమాన్ని విస్తరింపజేశారని గుర్తుచేశారు. 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణతో కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యక్రమాలు చేపట్టారు. 1952లో సీపీఐలో చేరి మొదటి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారని అన్నారు.

దున్నేవాడికే భూమి ఇవ్వాలన్న సీపీఐ పిలుపుతో దేవరకొండ ప్రాంతంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదలకు పంచడంలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న దేవరకొండ ప్రాంతానికి కృష్ణా జిల్లాలు అందించాలని నిర్వహించిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఎనలేని పోరాటాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, నాయకులు కే. శ్రీనివాస్ రెడ్డి, ప్రజాపక్షం ఎడిటర్ కందిమళ్ళ ప్రతాపరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు, ఉజ్జని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు పల్లా నరసింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలకొండ కాంతయ్య, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పీ.కేశవరెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, అంజయ్య నాయక్, పల్లా దేవేందర్ రెడ్డి, పల్లె నరసింహ, బొడ్డుపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed