పార్టీ జాతీయ హోదా రద్దు రాజకీయ కోణమే: కూనంనేని

by Disha Web Desk 2 |
పార్టీ జాతీయ హోదా రద్దు రాజకీయ కోణమే: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. నేటి నుంచి మే 15 వరకు “బీజేపీ కో హఠావో.. దేశ్ కో బచావో” అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాత్రను నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఏదో ఒక ప్రాంతంలో జరిగే యాత్రలో పాల్గొంటారని, దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. కేంద్ర అంశాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సైతం యాత్రలో ప్రాస్తవించనున్నట్టు తెలిపారు. మగ్ధుం భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంటింటికీ సీపీఐ’ యాత్రను తొలుత అంబేడ్కర్ విగ్రహం వద్ద పూల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఇందిరాపార్కు వద్ద ప్రారంభ సభ నిర్వహిస్తామని కూనంనేని వెల్లడించారు. ఈ యాత్రలో సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే.నారాయణ, అజీజ్ పాషా తదితరులు హాజరవుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది వరకు పలు ప్రాంతాల్లో నెల రోజుల పాటు ‘ఇంటింటికీ సీపీఐ’ లేదా ఇతర డిమాండ్లతో వినూత్నమైన పద్ధతిలో యాత్రను నిర్వహిస్తున్నామన్నారు.

కమ్యూనిస్టుల భావజాలం మీద దాడి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని హెచ్చరించారు. రాష్ట్ర విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్ లీకేజీల్లో నిందితులు బీజేపీ వారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయన్నారు. ఖమ్మం చీమలపాడులో ఘటనలో మృతులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇటీవల సీపీఐ పార్టీ జాతీయ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం చెప్పిందని, ఈ రద్దు ప్రక్రియ రాజకీయ కోణమే అని ఆరోపించారు. గతంలో కూడా సీపీఐ జాతీయ హోదా రద్దు చేయాలని అనుకున్న చరిత్ర తెలుసుకొని రద్దు చేయలేదని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పార్టీ సీపీఐ పార్టీ అని, ఇలాంటి పనుల వల్ల సీపీఐ పార్టీ నీ నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యపడదని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం కమ్యూనిస్టుల భావజాలం మీద దాడి తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. మరింత పట్టుదలతో, కసిగా పోరాటం చేస్తామని, సీట్లు వస్తే జాతీయ హోదా మళ్లీ వస్తుందని, కంకి కొడవలి గుర్తు సీపీఐకి పేటెంట్ రైట్స్ అని వివరించారు.



Next Story

Most Viewed