నష్టపరిహారం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు: CPI

by Disha Web Desk 2 |
నష్టపరిహారం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు: CPI
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి వంటి పంటలు అధిక శాతంలో నష్టపోయాయని తెలిపారు. నష్టపోయిన పంటలకు పరిహారం పది వేలు అందిస్తామని ఇదివరకు ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేటికీ పంటలకు పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్రమైన మానసిక వ్యధకు గురైతున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన పంటల సర్వే ప్రక్రియ కూడా ఇప్పటికి మొదలు కాలేదన్నారు. అంతేగాకుండా తేమ శాతం 16 కంటే ఎక్కువగా ఉన్నదని చెప్పి క్వింటాల్‌ వరి ధాన్యంలో 5 నుంచి 6 కిలోల తరుగు తీస్తున్నారని, తరుగు తీస్తున్న విధానంపై ప్రశ్నించిన రైతులపై కొంతమంది మిల్లర్ల యాజమాన్యం రైతుల మీద దాడులకు తెగబడుతున్నారని తెలిపారు.

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం సేకరణ మేనేజ్‌మెంట్‌ పద్దతికి భిన్నంగా కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాల్సి ఉండగా 16% తేమతో తూకమేస్తున్నారని, ఆ సమయంలో కూడా రైతుపై ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పిస్తున్నారని పేర్కొన్నారు. వర్షంలో దెబ్బతిన్న ధాన్యంలో తాలు, నూకల పేరుతో క్వింటాల్‌ వరి ధాన్యానికి 10 నుంచి 15 కిలోలు మిల్లర్లు కోతపెడుతున్నారని, దానిపైన ప్రభుత్వం శ్రద్ధ వహించాలన్నారు. మార్క్‌ఫెడ్‌కు కౌలుదారులు అమ్మిన మక్కజొన్నల డబ్బులు పట్టేదారు పేరు మీద వేస్తున్నారని, కౌలుదారు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని చూసే యంత్రాలను, మిల్లర్స్‌ ఉపయోగించే తేమ యంత్రాలతో సహా అన్నింటిని విజిలెన్స్‌ అధికారులతో పరిశీలించాలని సూచించారు. తక్షణమే రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed