కవితకు ఈడీ నోటీసులపై సీపీఐ కూనంనేని రియాక్షన్ ఇదే

by Disha Web Desk 2 |
కవితకు ఈడీ నోటీసులపై సీపీఐ కూనంనేని రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీకి ఎంత సేపు ఆప్, బీఆర్‌ఎస్, ప్రతిపక్షాల ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలో సీబీఐ, ఈడీ, ఇతర నిఘా సంస్థలను, చివరకు న్యాయవ్యవస్థను ఎలా ఉపయోగించాలనే చూస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన నయా హిట్లర్ ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ లేదన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళలో ఏ ఒక్క బీజేపీ వ్యక్తినైనా అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారా? అని నిలదీశారు. ఎవరినైనా చేస్తే చూపెట్టాలని సవాల్ చేశారు.

మనీ ల్యాండరింగ్ ఇతర కేసుల్లో 51 మంది బీజేపీ ఎంపీలపై ఆరోపణలు వచ్చాయని, 78 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయని, ఒకరిపైనైనా విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. దేశంలో లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని, అదానీ పేరుతో రూ.13లక్షలో కోట్ల కుంభకోణం, విజయ్ మాల్య, లలిత్ మోడీ తదితరులు కుంభకోణాలు వచ్చినా ఎవరిపై విచారణలు చేసి అరెస్టులు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలను కొల్లగొట్టి పెద్దలకు మేలు చేసేలా ఉన్నదని విమర్శించారు.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో మంచి వాటిని సమర్ధిస్తూనే, లోపాలను సరి చేయాలని కోరుతున్నామని అన్నారు. పేదల గుడిసెలన్నిటికీ పట్టాలు, గృహలక్ష్మి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ హఠావో దేశ్ బచావో పేరుతో ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు గల్లీ గల్లీలో పాదయాత్ర చేస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు. మోడీ హయాంలో ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని, ఇటీవల గ్యాస్, పెట్రోలు ధరలు పెద్ద ఎత్తున పెరిగాయని జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

Next Story

Most Viewed