ప్రెస్‌క్లబ్ ఎన్నికలు చెల్లుబాటే.. మూడు పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు

by Disha Web Desk |
ప్రెస్‌క్లబ్ ఎన్నికలు చెల్లుబాటే.. మూడు పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ (సోమాజీగూడ) ప్రెస్ క్లబ్‌కు ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలు, వెలువడిన ఫలితాలు చెల్లుబాటవుతాయంటూ మేజిస్ట్రేట్ కోర్టు వెలువరించిన ఉత్తర్వులపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూకు అనుబంధం) హర్షం వ్యక్తం చేసింది. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ తదితర పోస్టులకు మార్చి 13న జరిగిన ఎన్నికల్లో రెండు ప్యానెళ్ళ మధ్య ముమ్మర పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపు తర్వాత రిటర్నింగ్ అధికారి వెల్లడించిన ఫలితాలపై ఒక ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయం కోసం మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. రిటర్నింగ్ అధికారి ప్రకటనను కొట్టివేయాలని, పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినందున ఎన్నికలు చెల్లుబాటు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, రోజువారీ వ్యవహారాల్లో భాగంగా క్లబ్ నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శిగా తననే కొనసాగించాలంటూ రాజమౌళిచారి .. ఇలా వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై గతంలో విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఫైనల్ హియరింగ్ జరిపిందని, రిటర్నింగ్ అధికారి చేసిన ప్రకటన చెల్లుబాటవుతుందని స్పష్టం చేసినట్లు యూనియన్ కార్యదర్శి విరహత్ ఆలీ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 పోస్టులకు జరిగిన పోలింగ్‌ తర్వాత ఓట్ల లెక్కింపు జరిగిందని, 16 పోస్టుల విషయంలో గణాంకాలతో సహా రిజల్టును రిటర్నింగ్ అధికారి వెల్లడించారని, సర్టిఫికెట్లను జారీచేయడమూ పూర్తయిందని విరహత్ అలీ గుర్తుచేశారు. చివరగా అధ్యక్ష పోస్టుకు జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా అవతలి ప్యానెల్ తరఫున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, పోటీ చేసిన అభ్యర్థుల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచినవారికి పడిన ఓట్ల వ్యత్యాసం 80 వరకూ ఉన్నదని వివరించారు.

బ్యాలట్ పేపర్లపై గుర్తులు మారాయని, ఇంకు మరకలు ఉన్నాయనే అంశాలను తెరపైకి తెచ్చి ఫలితాల ప్రకటనను నిలుపుదల చేయాలంటూ రిటర్నింగ్ అధికారితో వాదన కూడా జరిగిందని పేర్కొన్నారు. న్యాయస్థానానికి వెళ్ళడంతో ఐదు నెలల పాటు విచారణ అనంతరం ప్రెస్ క్లబ్‌కు జరిగిన ఎన్నికలు చెల్లుబాటవుతాయని, రిటర్నింగ్ అధికారి వెల్లడించిన ఫలితాలు కూడా నిలుపుదల చేయడానికి ఆస్కారం లేదంటూ ఉత్తర్వులు వెలువడడం సంతోషంగా ఉందని విరహత్ అలీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed