కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ఆరంభం: బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్

by Disha Web Desk 11 |
కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ఆరంభం: బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఆరంభం అయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పరిశీలకులు తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో రెండు రోజులపాటు నిర్వహించిన ముగింపు సమావేశం మంగళవారం ముగిసింది. కార్యక్రమానికి తరుణ్ చుగ్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కుటుంబ, అవినీతి పాలన సాగుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు నక్షత్రాల భవనంలో గడుపుతుంటే యువరాజు, యువరాణి, సారథ్యంలో రాష్ట్రం లూటీ అవుతుందని తరుణ్ చుగ్ ఆరోపించారు.

8 సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, పుట్టబోయే బిడ్డల పైన లక్షల రూపాయలు అప్పుమోపుతున్నారని విమర్శించారు. మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వారికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఉద్యోగాలు లేక యువకులు రోడ్ల పైన తిరగాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దళితులను, రైతులను, వివిధ వర్గాల ప్రజలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. అక్షరాస్యతలో వెనుకబాటుతనం ఉండడంవల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాయ మాటలతో ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చారన్నారు. సచివాలయానికి పోకుండా ఇంటి వద్ద ఉండి అది సాయంత్రం నాలుగు గంటల తరువాతే సర్కారును నడిపే ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అతని ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ తాంత్రికులు చెప్పిన మాటలు నమ్మి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని చెప్పారు. ఎన్ని ఆర్ఎస్ లు మారిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో కాంగ్రెస్ వెంటిలేషన్ పై ఉంది. ప్రతిరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదో ఒకచోట నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడుతున్నారనీ చెప్పారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను గురించి ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర స్ఫూర్తితో ప్రజలకు చేరువ కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు అరవింద్, సోయం బాబురావు, ఎమ్మెల్యేలు రఘు నందన్ రావు, ఈటల రాజేందర్, జాతీయ, రాష్ట్ర నేతలు సునీల్ బన్సర్, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్, విజయశాంతి, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed