వివాదాస్పదంగా స్టాండింగ్ కమిటీ తీరు!

by Disha Web Desk 4 |
వివాదాస్పదంగా స్టాండింగ్ కమిటీ తీరు!
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని కోటి‌‌పై చిలుకు జనాభాకు అవసరమైన, అత్యవసరమైన పౌర సేవలనందించే జీహెచ్ఎంసీ తీసుకునే ప్రతి నిర్ణయంలో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయటంతో మీనామేషాలు లెక్కిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహారించే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మొదలుకుని కమిటీలోని తొమ్మిది మంది సభ్యులు అధికార పార్టీకి చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు సభ్యులు అధికార బీఆర్ఎస్ మిత్ర పక్షమైన మజ్లీస్ పార్టీకి చెందిన వారే.

నగరంలో పేదలు, మధ్య తరగతి చెందిన ప్రజలెక్కువ మంది నివసించే మురికివాడలు, బస్తీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ రూ.19.80 కోట్లకు సర్కార్ పరిపాలన మంజూరీనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఏ మాత్రం చొరవ చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరంలోని కోర్ సిటీలోని 12 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణను చేపట్టి, ఈఈఎస్ఎల్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకే ఈ సీనీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని ఇంతకు ముందున్న స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది.

ఆ స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ముగియటంతో కొత్త స్టాండింగ్ కమిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. పాత, కొత్త స్టాండింగ్ కమిటీల ముందుకు ముచ్చటగా మూడుసార్లు వచ్చినా, ఎందుకు ఆమోదం తెలపటం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా స్టాండింగ్ కమిటీ సభ్యులైన కొందరు ఇటీవల జరిగిన సమావేశంలో అసలే జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నపుడు ఈ ప్రతిపాదన అమలు చేయటం అవసరమా? అంటూ గళం విన్పించినట్లు సమాచారం. ఇందుకు అధికార పార్టీ సభ్యులు మౌనం వహించినట్లు తెలిసింది.

ఎందుకింత అలసత్వం..

స్టాండింగ్ కమిటీలోని అధికార పార్టీకి చెందిన సభ్యులు, మేయర్‌లకు సర్కారు ఆదేశాలంటే ఎందుకంత అలసత్వం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం ఆశించి సర్కార్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా నాన్చుతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆర్టీసీ తదితర శాఖలు సర్కారు ఆదేశాలను అమలు చేస్తూ, నగరంలో పలు రకాల సేవలను మెరుగుపర్చడం, సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇతర శాఖల మాదిరిగానే సర్కారు ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు స్టాండింగ్ కమిటీ ఎందుకు ఆమోదం తెలపడం లేదని కొందరు అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఆపటానికి ఆంతర్యమేమిటీ..?

నగరంలో పేదలు నివసించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న సర్కారు ప్రతిపాదనను ఆమోదం తెలపకుండా స్టాండింగ్ కమిటీ ఆపడంలో ఆంతర్యమేమిటీ? అన్న ప్రశ్న తలెత్తుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్‌కు అప్పగించాల్సి ఉన్నందున తమకేమీ ప్రయోజనం అన్న కోణంలో స్టాండింగ్ కమిటీలోని కొందరు సభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని ఆదేశాలుంటే ఎపుడో ఆమోదం పొందేదన్న వాదనలు విన్పిస్తున్నాయి.

Also Read..

ఖజానాకు కన్నం.. ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో ఇష్టారాజ్యం


Next Story

Most Viewed