తుగ్లక్ మళ్లీ పుట్టినట్లే కాంగ్రెస్ పాలన.. బీఆర్ఎస్ నేత క్రిశాంక్

by Rajesh |
తుగ్లక్ మళ్లీ పుట్టినట్లే కాంగ్రెస్ పాలన.. బీఆర్ఎస్ నేత క్రిశాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఆరునెలల పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్ళీ పుట్టి పాలన సాగిస్తున్నాడేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి జూపల్లి సోమ్ డిస్టలరీస్ విషయంలో అనుసరించిన వైఖరి ఆక్షేపణీయంగా ఉందన్నారు. అవినీతి గురించి ప్రశ్నించే సరికి జూపల్లి సోమ్ డిస్టలరీస్‌పై రకరకాల వైఖరులు తీసుకుని చివరకు తోకముడిచారన్నారు. సోమ్ డిస్టలరీస్‌కు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారనే దానిపై విచారణ జరగాలన్నారు.

ఫ్రాడ్ కంపెనీ అయిన సోమ్ డిస్టలరీస్‌కి రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవ్వరో బయటకు రావాలన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసులు పెట్టినపుడు ఇక్కడ సోమ్ డిస్టలరీస్ విషయంలో కేసు ఎందుకు నమోదు చేయరు అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం యూ టర్న్‌ల ప్రభుత్వం అని సెటైర్లు వేశారు. లీకులు ఇచ్చేది ప్రభుత్వమే.. వాటిని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అక్రమ కేసులు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అన్ని శాఖల్లో స్కాంల మీద స్కాంలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పందికొక్కుల్లా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని ఫైర్ అయ్యారు.

మంత్రి జూపల్లి రెండ్ హ్యాండెడ్‌గా దొరికి పోయారు అన్నారు. సోమ్ డిస్టలరీ కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చిన సంస్థ అని.. ఈ అవినీతిపై లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సోమ్ డిస్టలరీలకు అనుమతుల రద్దు తాత్కాలికమా , శాశ్వతమా ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. అబ్కారీ ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ అంటుంటే పెరగలేదని మంత్రి జూపల్లి అంటున్నారని విమర్శించారు. ఎవరిది నిజమో ప్రభుత్వం తరపున ప్రకటన చేయాలన్నారు. మంత్రులు అక్రమ టాక్సులు వసూలు చేయడంలో పోటీ పడుతున్నారన్నారు. సోమ్ డిస్టలరీకి అనుమతులను మేము అడ్డుకోక పోతే రాష్ట్రం లో కల్తీ మద్యానికి అమాయకులు బలి అయ్యేవారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు.

Next Story

Most Viewed