సీఎంలను మార్చేది, తొలగించేది కాంగ్రెస్ పార్టీనే: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

by Mahesh |
సీఎంలను మార్చేది, తొలగించేది కాంగ్రెస్ పార్టీనే: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తరుచుగా ముఖ్యమంత్రులను మార్చడం, తొలగించడం వంటివి కాంగ్రెస్ లోనే ఎక్కువగా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పదేండ్ల వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని ప్రకటనలు చేస్తున్నారని, దీని వెనుకున్న ఉద్దేశ్యమేంటని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ టూర్, లిక్కర్ స్కాం, కాళేశ్వరం స్కాం, ఫోన్ ట్యాపిoగ్ కేసు తరువాత తెలంగాణలో మార్పులు కనిపిస్తున్నాయని, దేశంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని తేలిపోయిందన్నారు. ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తలు, సర్వేలు సైతం బీజేపీకే పట్టం కడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలున్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, టీజేఎస్, వామపక్షాలు కలిసి లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని, పది, ఒకటి, ఆరుగా సీట్లు పంచుకున్నాయని చురకలంటించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపి నడిపిస్తోందని విమర్శించారు. లిక్కర్ స్కాం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బంధాన్ని పెంచినట్టుగా కనిపిస్తోందని సెటైర్లు వేశారు. ఈ రెండు పార్టీల మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. గతంలో సీఎల్పీ, బీఆర్ఎస్‌లో విలీనమైందని, ప్రస్తుతం బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.



Next Story

Most Viewed