కాలుష్య నివారణకు కసరత్తు.. కొత్త పాలసీ రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

by karthikeya |   ( Updated:2024-10-07 02:29:28.0  )
కాలుష్య నివారణకు కసరత్తు.. కొత్త పాలసీ రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్క్రాప్ పాలసీకి రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. గడువు తీరిన వాహనాలతో కాలుష్యం పెరుగుతోందని, దానిని అరికట్టాలని భావిస్తోంది. ఇప్పటికే దాదాపు మార్గదర్శకాలను రూపొందించినట్టు సమాచారం. త్వరలోనే రిలీజ్ చేయనుందని తెలిసింది. వాహనాన్ని స్క్రాప్ చేసిన వాహనదారుడికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోగానీ, ఇన్సూరెన్స్‌లో కానీ రాయితీ ఇవ్వాలని మార్గదర్శకాల్లో పొందుపర్చనున్నట్టు సమాచారం. రవాణా శాఖపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

కేంద్ర చట్టాలను స్టడీ చేసి నివేదిక రూపొందించిన ఆఫీసర్లు!

రవాణాశాఖలో భాగమైన స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆఫీసర్లు నూతన పాలసీ కోసం కేంద్ర ప్రభుత్వ చట్టాలను సైతం అధ్యయనం చేసి ఇప్పటికే ఒక రిపోర్టును సైతం రూపొందించినట్టు సమాచారం. శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు తెలిసింది. నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు 15 ఏండ్లు గడిచాక రిజిస్ట్రేష‌న్‌ను రెన్యువల్ చేయించుకోవాలి. ఖచ్చితంగా వాహనం ఫిట్ నెస్ టెస్టు చేయించుకోవాలి. ఫిట్‌నెస్ టెస్టుల్లో పాసైన వాహనాలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే మరో 3 నుంచి 5 ఏండ్ల పాటు పనిచేసేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఫిట్‌నెస్ టెస్టు చేయించుకోవడం.. ఇలా మరో 15 నుంచి 20 ఏండ్ల వరకు వాహనాలను వాహనదారులు నడుపుతున్నారు. దీంతో వాహన పొల్యూషన్ పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన స్క్రాప్ పాలసీని రూపొందిస్తోంది. 15 ఏండ్లు అయిన వాహనాలన్నింటినీ స్క్రాప్ చేయాలని, రెన్యువల్ చేయొద్దని ఈ పాలసీలో పేర్కొనబోతున్నట్టు సమాచారం.

15 ఏండ్లు పైబడిన, ఫిట్‌లెస్ వాహనాలు నాట్ అలౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం ప్రకారం 2025 జనవరి 1 నుంచి 15 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలను, ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిలైన వాహనాలను రోడ్లపైకి అనుమతించరు. లేదా ఇలాంటి వెహికల్స్2ను రిజిస్ట్రేషన్ కూడా చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్లు దాటిన ప్రభుత్వ వాహనాలనూ స్క్రాప్ చేయాలని కేంద్ర చట్టంలో పేర్కొంది. దీనినే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం 15 ఏండ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలు ప్రతిపాదించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా 8 ఏండ్లలోపు కమర్షియల్ వాహనాలకు రెండేండ్ల కాల పరిమితితో రెన్యువల్ రిజిస్ట్రేషన్(ఆర్ఆర్) చేస్తారు. ఆ టైం తర్వాత ఒక ఏడాది కాలపరిమితితో ఆర్ఆర్ చేస్తారు. ఫిట్‌నెస్ టెస్ట్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా స్పష్టంగా ఎన్ని ఏండ్ల వరకు చేయవచ్చనేది ఈ నూతన పాలసీలో పొందుపర్చనున్నారు.

స్క్రాప్ చేస్తే నూతన వెహికల్‌ కొనుగోలుకు రాయితీ!

స్క్రాప్ చేసిన వాహనదారుడికి నజరానాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అలా అయితేనే వాహన గడువు ముగిసిన వెంటనే సంబంధిత వాహనాన్ని స్క్రాప్ చేసేందుకు ముందుకొస్తారని సర్కారు భావిస్తోంది. ఇన్సురెన్స్‌లో కానీ లేదా మరో వాహన రిజిస్ట్రేషన్‌లో కానీ రాయితీ ఇవ్వాలా? వాహనంలో ఎంత శాతం ఇవ్వాలి? వాహన వెయిటేజీ లెక్కన ఇవ్వాలా? స్క్రాప్ చేసిన బండి సర్టిఫికెట్‌పైనా? వ్యక్తి పేరు మీదనా? ఎలా ఇస్తే బాగుంటుందనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 2 కంపెనీలు మాత్రమే ముందుకొచ్చి తమ కంపెనీలకు చెందిన వాహనాల గడువు ముగిస్తే స్ర్కాప్ చేస్తే కొత్త వెహికల్ కొనుగోలు సమయంలో రాయితీ ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. స్క్రాప్ చేసిన వెహికల్ నంబర్‌ను నూతన వాహనానికి రిజిస్ర్టేషన్ చేయబోతున్నట్టు సమాచారం. పాత వాహనాలను స్క్రాప్ చేసిన యజమానులకు మోటార్ వాహనాల పన్నుపై 5 నుంచి 15 % వరకు రాయితీని ఇచ్చే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాలం చెల్లిన వాహనాలతోనే ప్రమాదాలు

రాష్ట్రంలో 15 ఏండ్లు దాటిన వాహనాలు 30 లక్షలకు పైగా ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ వెహికల్స్ 20 లక్షలున్నాయని, ఇందులో 17 లక్షల ద్విచక్రవాహనాలు, 3.5 లక్షల కార్లు, 1 లక్ష గూడ్స్ క్యారేజీలు, 20 వేల ఆటో రిక్షాలున్నట్టు తెలిసింది. గడువు తీరిన వాహనాలు ప్రభుత్వ శాఖల్లో 10 వేలకు పైగా ఉన్నట్టు సమాచారం. 1,000 ఆర్టీసీ బస్సులు 15 ఏండ్లు దాటిన వాహనాల జాబితాలో ఉన్నట్టు సమాచారం. పలు విద్యా సంస్థలకు చెందిన 2 వేల బస్సులకు సైతం 15 ఏండ్ల కాలం చెల్లినట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. 15 ఏండ్లు దాటిన వాహనాలతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర రవాణాశాఖ తన నివేదికలో పేర్కొంది.

వాహనాలకు ఆటోమేటెడ్ టెస్టింగ్ సిస్టం

ప్రస్తుతం రవాణా శాఖ అధికారులే వాహనాల‌కు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని పొరపాట్లు జరిగి, సామర్థ్యం లేని వాహనాలు రోడ్లపైకి వచ్చే ప్రమాదముంది. అందుకే ఆటోమేటెడ్ టెస్టింగ్ విధాన అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పాలసీని సైతం రాష్ట్రంలో అమలు చేయాలని, మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాలను ఉపయోగించి వాహన సామర్థ్యాన్ని పరీక్షించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనిఈ పాలసీలో పొందుపర్చనున్నట్టు తెలిసింది. ఈ పాలసీలో రాష్ట్ర సర్కారు ఏయే నిబంధనలు పొందుపరుస్తుందనే ఆసక్తి అటు ఉద్యోగులు, ఇటు వాహనదారుల్లో నెలకొంది.

Advertisement

Next Story