మజ్లీస్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్.. ఫిరోజ్ ఖాన్‌కు కీలక పదవి!

by Disha Web Desk 2 |
మజ్లీస్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్.. ఫిరోజ్ ఖాన్‌కు కీలక పదవి!
X

దిశ, సిటీబ్యూరో: రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెల్చుకుని సర్కారును ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌ను గెల్చుకోలేకపొవటాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఎలక్షన్ కౌంటింగ్ ఫలితాల్లో కనీసం నాంపల్లి నియోజకవర్గం ఒక్క స్థానంలోనైనా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అనూహ్యంగా ఆ స్థానంలోనూ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నాంపల్లిలో పోటీకి దిగిన ఫిరోజ్ ఖాన్ వరుసగా నాలుగుసార్లు పోటీ చేసినా, ఒక్కసారి కూడా ఆయన గెలవకపోవటాన్ని ఆయన వర్గీయులకు మింగుడుపడటం లేదని తెలిసింది. నాటి పీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్స్‌లో గెలిచి ఉంటే నేడు మంత్రి హోదాలో ఉండేవాడంటూ నాంపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ నడుస్తుంది. కానీ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఓటమిపాలైన, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న సన్నిహిత్యంతో ఆయనకు ఎమ్మల్సీ పదవినిచ్చి, సర్కారు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే పదకొండు మంది మంత్రులతో ప్రమాణం చేయించిన సర్కారు మరో ఆరుగుర్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

అందులో ఒకరిగా ఫిరోజ్ ఖాన్ పేరుంటుందని ఆయన వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. హైదరాబాద్‌లోని మెజార్టీ స్థానాలను తన కంచుకోటగా మల్చుకున్న మజ్లీస్ పార్టీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినందున, అదే మైనార్టీ వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్‌కు మంత్రి పదవీ కేటాయిస్తే కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. మజ్లీస్‌కు ఓటింగ్ శాతం తగ్గందనేందుకు యాకుత్‌పురా, కార్వాన్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్‌లో లీడ్‌లోకి రావటమే నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇలాంటి సమయంలోనే మైనార్టీ నేతకు పట్టం కట్టి, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మైనార్టీ ఓటర్లకు ప్రయోజనం చేకూరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రకమైన వర్కవుట్ చేయాలంటే నాంపల్లి నియోజకవర్గంలో సానుభూతి, పాతబస్తీలో పలు కార్యక్రమాలను చేపట్టేందుకు కావల్సిన మైనార్టీ కార్డు ఉన్నందున, సిటీలో మజ్లీస్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెంచేందుకు, మజ్లీస్‌కు ఓటింగ్ శాతం తగ్గిన ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఫీరోజ్ ఖాన్‌కు ఎమ్మెల్సీనిచ్చి విషయానికి సంబంధించిన రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ఏడుకు పెరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు..

మహానగరంలోని కోటిన్నర జనాభాకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినపుడు కేవలం మూడుకే పరిమితమైన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య ప్రస్తుతం ఏడుకు పెరిగింది. 2020లో ఎన్నికలు జరిగినపుడు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నుంచి రజిత పరమేశ్వర్‌రెడ్డి, ఏఎస్ రావునగర్ నుంచి శిరీష సొమశేఖర్, లింగోజీగూడ నుంచి రాజశేఖర్ రెడ్డిలు కార్పొరేటర్లుగా గెలిచారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన విజయరెడ్డి అందరి కన్నా ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హాఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, పూజిత జగదీశ్వర్‌గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ బీఆర్ఎస్‌లో చేరినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఒకరు బీఆర్ఎస్‌లోకి వెళ్లగా, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య ఏడుకు పెరిగటం కాంగ్రెస్‌కు జనాదరణ పెరుగుతుందనేందుకు నిదర్శనం. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed