ఒక కాంగ్రెస్ MP అభ్యర్థి ఫిక్స్.. మరో 16 మందిపై కొనసాగుతున్న సస్పెన్స్!

by Rajesh |
ఒక కాంగ్రెస్ MP అభ్యర్థి ఫిక్స్.. మరో 16 మందిపై కొనసాగుతున్న సస్పెన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరు ఫిక్స్ చేశారు. దీంతో మిగతా 16 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ మొదలైంది. మిగతా 16 మంది ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును హస్తం పార్టీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే టికెట్లు ఆశిస్తూ 309 మంది అప్లై చేసుకున్నారు. బలమైన నాయకులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రియారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.

సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలుస్తారని అంతా భావించినా అనూహ్యంగా కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు రాజ్యసభ ఎంపీగా చాన్స్ ఇచ్చింది. దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా స్రవంతి, చార్టెట్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి బరిలో నిలిచేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి హరివర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్నా అంతకంటే బలమైన నాయకుడిని ఈ స్థానం నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నల్గొండ నుంచి జానారెడ్డి, దామోదరరెడ్డి, కోమటిరెడ్డి కుటుంబసభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి పీసీపీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్థానికంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదే స్థానం నుంచి బరిలో దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ, సూర్యపవన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి, భట్టి, తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

అయితే హై కమాండ్ ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ మారింది. మిగతా ఎంపీ స్థానాల్లో సైతం కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు చాన్స్ ఇవ్వొద్దని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేట స్టార్ చేసింది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను 14 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌కు సర్వేలు పాజిటివ్‌గానే ఉన్న క్యాండిడేట్ల ఎంపిక పెద్ద టాస్క్‌లా మారింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి సెకండ్ వీక్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఎంపీ అభ్యర్థులను త్వరగా ఫైనలైజ్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తోంది. మరి మిగిలిన 16 స్థానాల్లో ఎంపీగా పోటీ చేసే చాన్స్ ఎవరికి వస్తోందో తేలాలంటే మాత్రం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..



Next Story

Most Viewed