అంతుచిక్కని రెండో డోస్ వ్యక్తులు.. దూసుకుపోతున్న టీనేజర్ల టీకాలు

by Web Desk |
అంతుచిక్కని రెండో డోస్ వ్యక్తులు.. దూసుకుపోతున్న టీనేజర్ల టీకాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సెకండ్ ​డోసు బాధితులు దొరకడం లేదు. ఇప్పటి వరకు రెండో డోసు పొందాల్సిన వారిలో 87% మంది టీకాలు వేసుకోగా, మరో 13% మందికి రెండో డోస్ పూర్తి కాలేదు. వీరి కోసం టీమ్​లు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. రెండో డోస్ వేయించుకోవాల్సిన గడువు ముగిసినా సదరు వ్యక్తులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. డోసులు ఇచ్చేందుకు టీమ్​లు తిరుగుతున్నా లాభం లేదు. రెండో డోస్ లబ్ధిదారులు లభించడం లేదని క్షేత్రస్థాయిలో ఉండే ఆశ వర్కర్లు, ఏఎన్​ఎంలు వాపోతున్నారు. తప్పుడు అడ్రస్​లు, ఫోన్ ​నంబర్లు ఇవ్వడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా టెక్నికల్ సమస్యలు వచ్చాయి. టీకా తీసుకోకపోయినా వేసుకున్నట్లు, కేవలం మొదటిది పొందిదే రెండు, డబుల్​ టీకాలు తీసుకున్నా అసలు మెస్సేజ్​లు రాకపోవడం వంటి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో జనాల్లో కన్ఫ్యూజన్​ నెలకొంది. ఈ క్రమంలో చాలామంది టీకాల ప్రక్రియలో ఇబ్బంది పడ్డారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన పట్టణాల్లోనే ఈ సమస్య వేధిస్తోంది.

హైదరాబాద్​‌లో 80 శాతమే..

కరీంనగర్, హన్మకొండ​ జిల్లాల్లో రెండు డోసుల్లో 100% టీకా పంపిణీ పూర్తి కాగా, హైదరాబాద్​‌లో మాత్రం ఇప్పటి వరకు కేవలం 80% మంది మాత్రమే రెండో డోసు పొందారు. ఇక యాదాద్రి, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, జనగామ, మహబూబాబాద్​, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట​ , జగిత్యాల , నల్లగొండ, మంచిర్యాల జిల్లాల్లో సగటున 90% చొప్పున రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మహబూబ్​ నగర్ , భద్రాద్రి, భూపాలపల్లి, వరంగల్​, సూర్యాపేట​, నిర్మల్​, నాగర్​ కర్నూల్, సంగారెడ్డి, నిజామాబాద్​, మేడ్చల్​ జిల్లాల్లో సగటున 85 శాతం చొప్పున రెండో డోసు పూర్తయింది. వనపర్తి, వికారాబాద్​ , కొమురం భీం జిల్లాల్లో రెండో డోసు పంపిణీ వెనక పడింది.

15 నుంచి 17 ఏళ్లల్లో స్పీడ్​

రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్ల టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 72% మందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. హన్మకొండలో 100% పూర్తి కాగా, మహబూబ్​నగర్​ , ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, సిరిసిల్ల, సంగారెడ్డి, కొత్తగూడెం, గద్వాల్ జిల్లాల్లో సగటున 90 శాతం చొప్పున వ్యాక్సినేషన్​ జరిగింది. అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 51 శాతం మంది మాత్రమే టీకా పొందడం గమనార్హం.



Next Story

Most Viewed