ఆధారాలతో సహా కంప్లైంట్.. అయినా ‘శ్రీచైతన్య’పై నో యాక్షన్స్!

by Disha Web Desk 4 |
ఆధారాలతో సహా కంప్లైంట్.. అయినా ‘శ్రీచైతన్య’పై నో యాక్షన్స్!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: కాసుల కోసం కక్కుర్తిపడుతున్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆధారాలతో సహా కొన్ని సంఘాలు ఇలాంటి కళాశాలలపై ఫిర్యాదు చేసినా.. నోటీసులతో సరిపెట్టడమే తప్పా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అనుమతులు లేకుండా ‘శ్రీచైతన్య’ అదనపు తరగతులు

ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని 163/ఏఏ, టీసీఎస్ దగ్గర, బోంగ్లూర్‌లో శ్రీ చైతన్య కళాశాలకు కోడ్ నెంబర్ 58453తో అనుమతి ఉన్నది. కానీ ఇదే కోడ్‌తో మరో భవనంలో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలకు కోడ్ నెంబర్ 58360తో అనుమతి ఉంది. అయితే ఇదే కోడ్తో 22/7పీ, రోడ్డు నెంబర్ 4లో, గ్రీన్ హిల్స్, ద్వారక నగర్ కాలనీల మధ్య, ఆర్కేపురం పరిధిలో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ సమీపంలో ప్రభుత్వ అనుమతితో ఓ కళాశాల నడిపిస్తున్నారు. అయితే అదే పేరుతో ఇంటినెంబర్ 11–13–644, ఆర్వీ హౌజ్ బిల్డింగ్, హరిపురికాలనీ, ఎల్బీనగర్‌లో నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తున్నారు.

కళాశాలల నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కళాశాలలు నిర్వహించే భవనాలకు మున్సిపాలిటీ, ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా శ్రీ చైతన్య పేరుతో అనుమతులు తీసుకోకుండా పదుల చోట్ల అదనపు తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే ఇంటర్ బోర్డ్ రూల్స్ ప్రకారం రూ. 10 లక్షల జరిమానా విధించాలి. అయితే అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఫిర్యాదు చేసి నెలలైనా..

అనుమతులు లేకుండా శ్రీ చైతన్య కళాశాల తరగతులు నిర్వహిస్తున్నదని క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. దిల్ సుఖ్ నగర్, ఆదిభట్ల, మాదాపూర్, హరిపురి కాలనీల్లోని నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తున్నారో ఆధారాలతో సహా కంప్లయింట్ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 27 శ్రీ చైతన్య కళాశాలలుంటే అందులో 17 మాత్రమే అనుమతితో నడుస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఫిర్యాదులు చేసినా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గత డీఐఈఓపై అవినీతి ఆరోపణలు..

కొంతకాలం పాటు డీఐఈఓగా పని చేసిన వెంకయ్య నాయక్ ఇటీవల ప్రమోషన్‌పై వెళ్లారు. అయితే పని చేసినంత కాలం ఆయన కార్పొరేట్ కళాశాలలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత అడిగితే.. ‘ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందిస్తున్నది’ అని కాలం వెళ్లదీశారని వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. శ్రీ చైతన్య యాజమాన్య నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీ చైతన్య కళాశాలల ఏజీఎంలకు వివరణ కోరితే.. అన్ని కళాశాలలు నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గత డీఐఈఓ వెంకయ్య నాయక్‌పై ఎంక్వయిరీ చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Disha E-paper

Next Story