లోపం ఎక్కడా..? సర్కారీ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు

by Disha Web Desk |
లోపం ఎక్కడా..? సర్కారీ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో :ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యం కారణంతో పేషెంట్లకు ఇన్​ఫెక్షన్లు ప్రబలుతున్నాయి. వరుస సంఘటనలు జరుగుతున్నా, అధికారుల్లో చలనం లేదు. ఏకంగా గర్భిణులకు ఇన్​ఫెక్షన్లు ప్రబలుతున్నా, బాలింతలు మరణిస్తున్నా వైద్యారోగ్యశాఖ మొక్కుబడిగా వ్యవహరిస్తున్నది. సంఘటన జరిగినప్పుడే హడావిడి చేస్తూ ఆ తర్వాత సమస్యను పరిష్కరించడం లేదు. ఇటీవల ఇబ్రహీంపట్నం, మలక్​పేట్, మంచిర్యాల, నాగర్​కర్నూల్​, వనపర్తి తదితర ఆసుపత్రులలో గర్భిణీలకు తీవ్ర అవమానం జరిగింది. కొన్ని ఆసుపత్రులలో సకాలంలో అడ్మిట్ చేసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, ఇంకొన్ని ఆసుపత్రులలో డెలివరీలు తర్వాత సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇన్​ఫెక్షన్లు వ్యాప్తి చెందడం జరిగాయి. దీంతో బాధితులు, కుటుంబ సభ్యులు పరేషాన్​అవుతున్నారు.

రోగుల రద్దీ ఎక్కువగా ఉండటంతోనే పేషెంట్లకు సమర్ధవంతంగా మానిటరింగ్ చేసే పరిస్థితిలేదని డాక్టర్లు చెబుతుండగా, ప్రభుత్వం మ్యాన్​పవర్ పెంచే ప్రయత్నం చేయడం లేదు. కానీ ప్రతి నెల టెలీ, వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తూ అంతా సక్రమంగా చేస్తున్నామని మంత్రితో పాటు అధికారులూ భ్రమ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ని వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకొని పరిష్కరించడం లేదు. రిపోర్టులు, ప్యారమీటర్స్​ను చూసి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నది. రివ్యూల్లో అధికారులంతా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్లు స్వయంగా వైద్యారోగ్యశాఖ డాక్టర్లు ఆరోపించడం గమనార్హం.

డబ్ల్యూహెచ్​వో దృష్టికి...

రాష్ట్రంలో వరుసగా గర్భిణులు, బాలింతలు మరణించడంపై కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాసుపత్రులలో పేదలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయానని డబ్ల్యూహెచ్​వోకు వివరించారు. మలక్‌పేట్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సిజేరియన్ చేసిన పది మంది మహిళల్లో ఇద్దరు పరిస్థితి విషమించడంతో సంరక్షణ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కంప్లైంట్​లో పొందుపరిచారు. ఇక గత ఏడాది ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా వచ్చిన సెప్సిస్‌తో నలుగురు మహిళలు మరణించినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని నలుగురు మహిళలు మరణించారు.

2017 డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్​ఆసిఫ్ నగర్‌లో నివాసం ఉంటున్న షబానా బేగం నాంపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి పేట్లబుర్జ్‌కు రెఫర్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెను సకాలంలో అడ్మిట్ చేసుకొని వైద్యం అందించలేకపోవడంతోనే మరణించినట్లు జడ్సన్​ఫిర్యాదు చేశారు. మంచిర్యాల ఎంసీహెచ్​లోనూ ఇన్​ఫెక్షన్ల కారణంతో బాలింతలు ఇబ్బందులు పడ్డట్లు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, కానీ బయటకు రానివెన్నో సంఘటనలు ఉన్నట్లు జడ్సన్​పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో సరిగ్గా పరికరాలు శుభ్రం చేయకపోవడంతో పాటు, పేషెంట్లకనుగుణంగా స్టాఫ్​ లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని జడ్సన్​ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed