నేషనల్ పాలిటిక్స్‌లో తెలుగువారి పాత్రపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
నేషనల్ పాలిటిక్స్‌లో తెలుగువారి పాత్రపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర ఈ మధ్యన కనిపించడం లేదని, కాలక్రమేణా తగ్గిపోతూ ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డి, ఎన్టీ రామారావు, పీవీ నర్సింహారావు లాంటివారు జాతీయ రాజకీయాలను శాసించారని, ఆ తర్వాత జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు తదితరులు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని అన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్‌రావు రచించిన ‘గవర్నర్‌పేట్ టు గవర్నర్స్ హౌజ్’ అనే పుస్తకాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా తెలుగువారిగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసుండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకమైన, అనివార్యమైన పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడాల్సి వచ్చిందని, అప్పటి భావోద్వేగాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో మన తెలుగు అనే గుర్తింపు కోసం కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావడం మంచి అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. దాదాపు 76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరినీ కలుసుకోవడం గొప్ప అనుభూతి అని అన్నారు.

జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. జాతీయ రాజకీయాల్లోనూ ఆ స్థాయికి చేరుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర కేబినెట్‌లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనుభవజ్ఞుల నుంచి తమ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని అన్నారు. గతంలో నంద్యాలలో పీవీ నర్సింహారావు లోక్‌సభకు పోటీ చేసినపుడు ఒక తెలుగువాడు ప్రధానిగా ఉండాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఎన్టీఆర్ ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్నే పాటిస్తుందన్నారు.

Advertisement

Next Story