CM Revanth Reddy : బాబా ఆమ్టేకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

by M.Rajitha |
CM Revanth Reddy : బాబా ఆమ్టేకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
X

దిశ, వెబ్ డెస్క్ : బాబా ఆమ్టే(BaBa Amte)గా ప్రసిద్ధులైన మురళీధర్ దేవదాస్ ఆమ్టే(Muralidhar Devadas Amte) వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. సమాజంలో చిన్న చూపుకు గురైన కుష్టురోగులను చేరదీసి, ఆనంద్‌వన్(Anandvan) ఆశ్రమంలో వారికి సేవలందించిన మానవతావాది బాబా ఆమ్టే అని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి దీన జనుల బాంధవుడిగా పేరు పొందారని ముఖ్యమంత్రి కొనియాడారు. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ వెంట నడిచి, జీవితాంతం మహాత్ముడి ఆశయాల సాధన కోసం బాబా ఆమ్టే కృషి చేశారని గుర్తుచేశారు. అభయ్ సాధక్ బాబా ఆమ్టేగా జనాధారణ పొందిన ఆయనకు వినమ్రపూర్వక నివాళులు అర్పిస్తున్నట్టు తెలియజేశారు.

డిసెంబరు 6, 1914లో మహారాష్ట్ర వార్ధా జిల్లా హింగన్‌ఘాట్‌లో జన్మించిన మురళీధర్ దేవదాస్.. 20 ఏళ్లకే లా పట్టా పుచ్చుకుని సొంతంగా సంస్థను నెలకొల్పి, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టయిన జాతీయ నేతల తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలవైపు ఆకర్షితులై, జీవిత చరమాంకం వరకూ వరకు ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. కాలక్రమంలో దేశంలో పాతుకుపోయిన అన్యాయాలు, అసమానతలపై పోరాటం సాగించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేశారు. కుష్టువ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తిని చూసి ఆమ్టే చలించిపోయిన ఆయన.. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా చంద్రాపుర్ జిల్లా వరోరా వద్ద 1951లో ఆనంద్‌వన్ పేరుతో ఆశ్రమాన్ని స్థాపించారు. సమాజం నుంచి వెలివేసే కుష్టురోగులను చేరదీసి, వారితో పాటు తను కూడా అక్కడే ఉంటూ కుష్టువ్యాధిపై జనంలో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.

తన చివరి శ్వాస వరకు అనంద్‌వన్‌లో గడిపి 2008 ఫిబ్రవరి 9న కన్నుమూశారు. ఆయన ఈ లోకం విడిచి వెళ్లిపోయిన ఆమ్టే కుమారుడు ప్రకాశ్ ఆమ్టే తండ్రి సేవలను కొనసాగిస్తున్నారు. కాగా బాబా ఆమ్టేకు పద్మవిభూషణ్, గాంధీ శాంతి బహుమతి, రామన్ మెగసెసే అవార్డు, డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు, టెంపుల్టన్ ప్రైజ్, జమ్నాలాల్ బజాజ్ అవార్డు వంటి అవార్డులు లభించాయి.

Next Story

Most Viewed