నువ్వు ఎట్లా పదేళ్లు మంత్రివి అయ్యావు.. హరీశ్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 14 |
నువ్వు ఎట్లా పదేళ్లు మంత్రివి అయ్యావు.. హరీశ్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంవత్సరానికి 6 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించే స్థితిలో ఉన్న తెలంగాణను కేసీఆర్ చేతులో పెడితే.. వారు 80 వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పదేళ్లలో ప్రతి సంవత్సరం 70 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళకు తెచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ సచివాలయంలో సింగరేణి కార్మికులకు రూ. కొటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో సింగరేణి సంస్థ కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన వ్యక్తి ప్రపంచంలో కేసీఆర్ ఒక్కరే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితిని నుంచి 25 తారీఖు విడుతల వారిగా చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మొదటి నెలలో 4 వ తేదీ జీతాలు ఇచ్చామన్నారు. రెండో నెలలో 1న జీతాలు చెల్లించామన్నారు.

ఇప్పటికి కేటీఆర్ హరీశ్ రావు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు బంధు చెల్లించడం లేదని అంటున్నారని తెలిపారు. డిసెంబర్ నుంచి మొదలు పెట్టి అక్టోబర్ వరకు చెల్లించుకుంటాపోతామన్నారు. జనవరిలో మొదలు పెట్టి మార్చి 31 వరకు రైతు బంధు చెల్లిస్తామని స్పష్టంచేశారు. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపు రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. చేసి చూపిస్తామన్నారు. 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చని, కాకపోతే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకపోతే.. రైతు బంధుకు విడుదల చేయోచ్చన్నారు. బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. వారిపై జాలి కలుగుతుందన్నారు. తండ్రి, కొడుకు, మామా అల్లుండ్లు తప్ప.. ఏ ఒక్కరు కూడా వారి అభిప్రాయాలను ఏకీభవించడం లేదన్నారు.

మండలిలో ఎమ్మెల్సీ కవిత, శాసన సభలో హరీష్ రావు, కేటీఆర్, బహిరంగ సభల్లో కేసీఆర్ ఈ నలుగురి గోస, ఘోషనే వినిపిస్తుంది తప్ప.. అసలు ఎవరైనా వారి పార్టీ వారైనా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. పదేళ్లు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. కోర్టు పరిధిలో ఉన్న వాటికి మేం పరిష్కారం చూపించాం.. 60 రోజుల్లో 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టామన్నారు. మేము వండిన తర్వాత వచ్చి తెడ్డు తిప్పాడని హరీశ్ రావు అంటున్నారని, గా తెడ్డు తిప్పే చేతకాని సన్నాసి నువ్వు ఎట్లా పదేళ్లు మంత్రివి అయ్యావు.. అని ఫైర్ అయ్యారు. మరి ఇన్ని చేసినవాడివి అధి కూడా నువ్వే చేస్తే అయిపోయేది.

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలని యోచిస్తున్నామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్ కార్డు నిబంధన పెడుతున్నామని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ చేసి నిరంతరం కొత్త లబ్దిదారులను చేరుస్తామన్నారు.



Next Story

Most Viewed