కొత్త సచివాలయంలో KCR సంచలన ప్రకటన.. ప్రత్యర్థులు సిద్దం కాకముందే దెబ్బకొట్టేలా ప్లాన్?

by Disha Web Desk 19 |
కొత్త సచివాలయంలో KCR సంచలన ప్రకటన.. ప్రత్యర్థులు సిద్దం కాకముందే దెబ్బకొట్టేలా ప్లాన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ రద్దు ఉండదని, ముందస్తు ఎన్నికలు రావని అధికార బీఆర్ఎస్ పదేపదే చెప్తున్నా.. అధికారుల మొదలు ప్రజల వరకు అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల ముందే బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం, ఆనవాయితీకంటే ముందే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముందస్తు సందేహాలను బలపరుస్తున్నాయి. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ జన్మదినం రోజున గ్రాండ్‌గా ప్రారంభించాలనే నిర్ణయం జరిగింది. ఆ వెంటనే అక్కడే ఫస్ట్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఈ మొదటి సమావేశమే ప్రభుత్వానికి చివరి మంత్రివర్గ భేటీ అవుతుందనే చర్చలు మొదలయ్యాయి. ఆ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు ముందస్తు ఎన్నికలు ఉండవంటూ ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీ నేతల వరకు పదేపదే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సందేహాలను మరింత ధృవీకరిస్తున్నాయన్న భావన నెలకొన్నది. ప్రత్యర్థులను కన్‌ప్యూజ్ చేయడానికి, వారు సంసిద్ధం కాకముందే యుద్ధాన్ని మొదలుపెట్టాలన్న వ్యూహంతోనే బీఆర్ఎస్ పావులు కదుపుతున్నదనే చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మేల్కొనక ముందే ఎన్నికల బరిలోకి దిగి ప్రయోజనం పొందాలన్నది బీఆర్ఎస్ వ్యూహమనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు రిలీజ్ కాకముందే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఒకేసారి రెండు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ బహిరంగంగా ఒక ప్రకటన చేస్తే ఆచరణ దానికి రివర్స్‌లో ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ పలుమార్లు కామెంట్ చేశారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల విషయంలోనూ దాన్నే రెండు రోజుల క్రితం ప్రస్తావించారు. గతంలో ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ ఈసారి కూడా అదే వ్యూహాన్ని అవలంబిస్తారనే చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుకు నిధుల ఇబ్బందులకు తోడు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మరింత పెరిగి వ్యతిరేకత స్థాయికి చేరుకోకముందే మేలుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యమైనా కొద్దీ రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదముందన్న అంచనాకు వచ్చినట్లు తెలిసింది. దాన్నుంచి బైటపడడానికే వీలైనంత తొందరగా ముగించేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

దీన్ని గ్రహించిన బీజేపీ మార్చి చివరికల్లా గ్రౌండ్ వర్క్‌ను పూర్తిచేసుకుని ఇక ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోవాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 20వ తేదీకల్లా రాష్ట్రవ్యాప్తంగా 9 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగులను పూర్తిచేయాలన్న యాక్షన్ ప్లాన్ కూడా అందులో భాగమే. కాంగ్రెస్ సైతం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని దాదాపు పాదయాత్రగా, ఎన్నికల ప్రచార కార్యక్రమంగా నిర్వహించాలనుకుంటున్నది. హడావిడిగా బడ్జెట్ సెషన్‌ను ఫిక్స్ చేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ తన బర్త్ డే రోజునే కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలనుకోవడం, అమరవీరుల స్మారక స్థూపం పనులను సైతం వీలైనంత తొందరగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించడం.. ఇవన్నీ 'ముందస్తు' సందేహాలకు బలం చేకూర్చినట్లయింది.

గవర్నర్‌తో తలెత్తిన విభేదాలతో అసెంబ్లీ రద్దు తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయోననే చర్చలూ జరుగుతున్నాయి. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ కొనసాగే పరిస్థితులు ఉంటాయా లేక పరిపాలన గవర్నర్ పరిధిలోకి వెళ్ళిపోతుందా లేక ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయానికి బదులుగా షెడ్యూలు సమయానికే నిర్వహించాలని ఈసీ భావిస్తుందా.. ఇలాంటి అనేక చర్చలు పార్టీల నేతల్లో, అధికారుల్లో జరుగుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా అనేది నెల రోజుల్లో తేలిపోనున్నది.

Also Read...

రాయలసీమపై కేసీఆర్ ఫోకస్.. BRSలోకి ఆ కీలక నేతలు



Next Story

Most Viewed