కేసీఆర్ 6th ఫ్లోర్ సెంటిమెంట్.. ఆ స్పెషల్ రోజున ప్రారంభానికి రంగం సిద్ధం!!

by GSrikanth |
కేసీఆర్ 6th ఫ్లోర్ సెంటిమెంట్.. ఆ స్పెషల్ రోజున ప్రారంభానికి రంగం సిద్ధం!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు సిక్స్ ఫోర్ సెంటిమెంట్. అందుకే ఆ ఫ్లోర్‌ను దసరా రోజు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఫ్లోర్‌లో అన్ని సౌకర్యాల కల్పనకు పనులు వేగవంతం చేశారు. ఆ ఫ్లోర్ వాస్తుప్రకారం నిర్మాణం చేయిస్తుండటంతో ఇక్కడి నుంచే మునుగోడు బై పోల్‌తో పాటు రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. సిద్దాంతి సూచన మేరకు సీఎం అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణలోని పాత సెక్రటేరియట్ భవన స్థానంలోనే కొత్త భవనాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 9 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయ నిర్మాణం జరుగుతోంది. గాలి, వెలుతురు ప్రసరించేలా భవనంలో మొత్తం 1008 దర్వాజాలు, 465 కిటికీలు ఉండేలా పక్కా వాస్తుతో రూ.600 కోట్లపైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక 6వ అంతస్తు పూర్తిగా ముఖ్యమంత్రికి కేటాయిస్తున్నారు. భవనం నైరుతి భాగంలో సీఎం ఛాంబర్ ఉంటుంది. ఇదే అంతస్తులో సీఎంఓ అధికారులు, ఇతర సిబ్బందిని అకామడేట్ చేయనున్నారు. విశాలమైన మీటింగు హాల్స్, మంత్రివర్గ సమావేశాల నిర్వహణ కోసం సౌండ్ ప్రూఫ్‌తో మరో హాల్‌ను నిర్మించారు. మొదటగా సెక్రటేరియట్‌ను దసరాకు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, కరోనాతో భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాలేదు. దీంతో సిక్స్త్ ఫ్లోర్‌ను మాత్రం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫ్లోర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన అన్ని ప్లోర్లను సంక్రాంతి వరకు పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.

తొలుత రెండు శాఖలు..

సెక్రటేరియట్ 2వ అంతస్తు పూర్తిగా ఆర్థికశాఖ అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉంది. అయితే, దసరాకు సీఎం చాంబర్‌ను ప్రారంభిస్తుండటంతో ఆర్థికశాఖ, జేఏడీ శాఖలను సైతం నూతన సెక్రటేరియట్‌కు తరలించనున్నట్లు సమాచారం. మిగిలిన అన్ని శాఖలను సంక్రాంతి వరకు తరలించే అవకాశం ఉంది. సచివాలయం నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపు నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. బిల్డింగ్ వెనుక భాగంలో సీఎం, మినిస్టర్ల వాహనాల పార్కింగ్ ఉంటుంది. దక్షిణ భాగంలో ఉన్న గేటు నుంచి అధికారులు, ఇతర ఉద్యోగులు ఎంటరవుతారు. ఉత్తర ద్వారంలో సందర్శకులకు అవకాశం కల్పించారు. భవనం మధ్య భాగంలో సుమారు రెండెకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు.

సిద్ధాంతి సూచన మేరకే..

అన్నిశాఖలను ఒకేసారి నూతన సచివాలయానికి తరలించేలా మొదట ప్లాన్ చేశారు. కానీ, భవన నిర్మాణం పూర్తి కాకపోవడం, దసరా తర్వాత మంచి రోజులు లేకపోవడంతో సీఎం ఆఫీసు ఉండే సిక్స్ ఫ్లోర్‌ను ప్రారంభిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అంతా శుభం కలుగుతుందని సిద్ధాంతి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దాని ప్రకారమే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదటి నుంచి కేసీఆర్‌కు.. దేవుడిపై విశ్వాసం ఉండటంతో సిద్ధాంతులు చెప్పిన ప్రకారమే ముందుకు సాగుతారనే ప్రచారం ఉంది. దీంతో వారి సూచన మేరకే మొదటగా సీఎం ఉండే సిక్స్ ఫ్లోర్‌ను ప్రారంభించనున్నారు. అంతేగాకుండా వాస్తు ప్రకారం సెక్రటేరియట్‌ను నిర్మిస్తుండటంతో రాబోయే ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచి ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. సీఎం చాంబర్‌ను ప్రారంభించిన 90 రోజుల్లో ముందస్తుకు వెళ్లినా కలిసి వస్తుందని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని డిజల్వ్ చేస్తే ఏప్రిల్‌లో కర్నాటకతోపాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సైతం జరుగుతోంది.

Next Story