'ఎట్ హోమ్'కు చివరి నిమిషంలో సీఎం దూరం

by Disha Web Desk |
ఎట్ హోమ్కు చివరి నిమిషంలో సీఎం దూరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంద్రాగస్టు సందర్భంగా రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం గవర్నర్ ఏర్పాటు చేసిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, అన్ని పార్టీల అధినేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలు స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు ఇన్విటేషన్‌ను పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు అటు ప్రగతి భవన్ వర్గాలు, ఇటు రాజ్‌భవన్ సిబ్బంది క్లారిటీ ఇచ్చాయి. సాయంత్రం ఏడు గంటలకు ఈ కార్యక్రమం మొదలుకావాల్సి ఉన్నప్పటికీ సీఎం రాకపోవడంతో దాదాపు పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ చివరి నిమిషాల్లో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ రద్దయింది.

సీఎం హాజరవుతారన్న ఉద్దేశంతో ప్రత్యక్ష ప్రసారానికి టీవీ ఛానెళ్ళకు లైవ్ సిగ్నల్ సమాచారం ఇచ్చింది ప్రగతి భవన్. కానీ చివరి నిమిషాల్లో సీఎం హాజరుకావడంలేదని తేలిపోయింది. దీంతో మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా హాజరుకాలేదు. ప్రధాన కార్యదర్శి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కరోనా కారణంగా ఐసొలేషన్‌లో ఉండడంతో హాజరుకాలేనంటూ రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉన్నందున బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరుకాలేదు. సీఎం గైర్హాజరుకు నిర్దిష్ట కారణాలను అటు ప్రగతి భవన్ వర్గాలు ఇటు పార్టీ వర్గాలు మరోవైపు రాజ్‌భవన్ వర్గాలు చెప్పలేదు.

రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు గత కొంతకాలంగా ముఖ్యమంత్రి దూరంగానే ఉంటున్నారు. గతేడాది అక్టోబరులో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ మళ్లీ ఈ ఏడాది గత నెలలో కొత్త సీజేగా వచ్చిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికే హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల పాటు రాజ్‌భవన్ గడప తొక్కలేదు. గత నెలలో ఈవెంట్‌కు హాజరైనందున ఇప్పుడు పంద్రాగస్టు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారని సీఎంఓ నుంచి రాజ్‌భవన్‌కు స్పష్టమైన సమాచారమే వచ్చింది. కానీ చివరకు ఆబ్సెంట్ అయిన విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

మొదటి నుంచీ సందేహపడుతున్నట్లుగానే 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ముఖ్యమంత్రి గైర్హాజరు కావడం పలు అనుమానాలను ధృవపరిచినట్లయింది.

మంత్రి ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలి : దాసోజు శ్రవణ్


Next Story