35 మంది ఎమ్మెల్యేల పనితీరుపై KCR అసంతృప్తి.. వేటు పడేనా?

by Disha Web Desk 2 |
35 మంది ఎమ్మెల్యేల పనితీరుపై KCR అసంతృప్తి.. వేటు పడేనా?
X

బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తు్న్నాయి. ‘పనితీరు సరిగా లేని వారి తోకలు కట్ చేస్తా’ అని ఆయన చేసిన వార్నింగులు వారిలో టెన్షన్స్ రేపుతున్నాయి. సమావేశం పూర్తయిన మరుక్షణం నుంచే ఎమ్మెల్యేల మధ్య ఇదే అంశంపై చర్చ స్టార్ట్ అయ్యింది. సీఎం ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు ? ఆయన లిస్టులో ఎవరెవరున్నారు ? ఈ సారి టికెట్లు కట్ అయ్యేదెవరికి? ఏయే జిల్లాలో ఎంత మంది ఉన్నారు? అందులో మంత్రులు కూడా ఉన్నారా? అనే ప్రశ్నలు వారి మధ్య చక్కర్లు కొడుతున్నాయి.

దిశ,తెలంగాణ బ్యూరో: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే శక్తి ఎంత మందికి ఉందోనని తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ సర్వేలను ప్రమాణికంగా తీసుకుంటున్నారు. అందుకోసం ఆయన పలు రకాల సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఏయే దందాలు చేస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? సంక్షేమ పథకాల మంజూరు కోసం వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారా? అనే కోణంలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే తెప్పించుకున్న రిపోర్టులో 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని సీఎం గురువారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో స్పష్టం చేసినట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు.

రిపోర్టు కోసం అన్వేషణ

పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆ లిస్టులో తాము ఉన్నామా? లేమా? అనే టెన్షన్ వారిలో పట్టుకున్నది. ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే వర్గాల ద్వారా ఆ జాబితాలో తాము ఉన్నామా..లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తమ పట్ల నెగెటివ్ రిపోర్టు ఉంటే మార్చుకుంటామని వేడుకుంటున్నారు. అలా వేడుకునే వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం.

మాట మార్చిన సీఎం కేసీఆర్

సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆరు నెలల్లోనే ఆయన మాట మార్చారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, తీరు మార్చుకోకపోతే టికెట్లు కట్ చేస్తామని హెచ్చరించారు. గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 25 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, తాను చేయించిన సర్వేల్లో తేలిందని ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

Read more:

బిగ్ న్యూస్: అక్టోబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్..? KCR వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ..!



Next Story

Most Viewed