నేడు మహారాష్ట్రలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. వాటిపైనే మెయిన్ ఫోకస్!

by Disha Web Desk 2 |
నేడు మహారాష్ట్రలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. వాటిపైనే మెయిన్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందర్ లోహలో ఆదివారం మధ్యాహ్నం జరిగే బీఆర్ఎస్ బహిరంగసభలో అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారనేదానిపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొన్నది. బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా తీవ్ర స్థాయిలో ఇటీవలి కాలంలో విమర్శలు చేస్తున్న కేసీఆర్ తాజాగా రాహుల్‌గాంధీ అంశాన్ని హైలైట్ చేస్తూ మరింత ఘాటుగా విరుచుకుపడే అవకాశమున్నది. కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు పాల్పడుతున్నదని, రాజకీయంగా ఎదుర్కోడానికి బదులుగా లొంగదీసుకోవాలన్న ఆలోచనతో బెదిరింపు చర్యలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి ఇటీవల పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును ఖండించడంతో పాటు మరో ఏడు పార్టీల మద్దతు కూడగట్టిన కేసీఆర్ రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన అంశంలోనూ ముందే ఉన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ఒక పథకం ప్రకారమే ప్రతిపక్షాల నాయకులను వేధిస్తున్నదని, వాటిని స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తున్న కేసీఆర్ మరో 13 పార్టీలను కలుపుకుని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంలో చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, పరిపాలనా తీరును ఎండగడుతున్న బీజేపీని, ప్రధాని మోడీని రాజకీయంగానూ తూర్పారపడుతున్న సమయంలో లోహాలో జరిగే బహిరంగసభలో ఏ స్థాయిలో విమర్శలు చేస్తారనే ఆసక్తి నెలకొన్నది. బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరింపజేయాలనుకుంటున్న కేసీఆర్ మహారాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాందేడ్‌లో అభ్యర్థులను బరిలోకి దించాలనుకుంటున్నారు.

నాందేడ్‌లో గత నెల 5న సభ నిర్వహించిన తర్వాత రెండు నెలలు కూడా పూర్తికాకముందే లోహలో అదే తరహా బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సైతం హాజరవుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు గత వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. లోహ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 తాలుకాల్లో బీఆర్ఎస్ గురించి చర్చి జరిగేలా ఇప్పటికే డిజిటల్ స్క్రీన్‌లతో కూడిన మొబైల్ వ్యాన్లు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, వివిధ సెక్షన్ల ప్రజలకు అందిస్తున్న స్కీమ్‌లు తదితరాలను డిజిటల్ డిస్‌ప్లే ద్వారా ప్రచారం చేస్తున్నాయి. ఈ సభకు జిల్లా నుంచి విస్తృతంగా ప్రజలను తరలించే ఏర్పాట్లు జరిగాయి.

రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్య అని, దేశం ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోతూ నియంతృత్వంలోకి పోతున్న తీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీని గతంలో వ్యక్తిగతంగా పప్పు అని బీజేపీ నాయకులు కామెంట్ చేసినప్పుడు కేసీఆర్ స్పందించి వ్యక్తిగతంగా అలాంటి విమర్శలు చేయడం తగదంటూ ఖండించారు. తాజాగా ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బీజేపీ వ్యతిరేక పోరాటాల్లో ఆ పార్టీతో కలిసి పాలుపంచుకుంటున్నారు. అదానీపై హిండెన్‌బర్గ్ రిపోర్టు బహిర్గతం చేసిన వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనానికి బీఆర్ఎస్ పట్టుబట్టింది.

పార్లమెంటు ఉభయ సభల్లోనూ మోడీపై ఒత్తిడి పెంచేలా చర్చకు అవకాశమివ్వాలంటూ స్పీకర్, చైర్మన్‌లకు బీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇదే డిమాండ్‌తో పార్లమెంటు ఆవరణలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కూడా పాల్గొన్నది. కాంగ్రెస్‌తో ఎన్ని విభేదాలు ఉన్నా బీజేపీ వ్యతిరేక పోరులో మాత్రం వాటితో కలిసే పోతున్నది. ఇప్పుడు రాహుల్‌గాంధీ తాజా అంశాన్ని సైతం లోహ సభలో ప్రస్తావిస్తారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. లోహాలో జరిగే సభకు ముందే బీజేపీ, ఎన్సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన తదితర పార్టీల నుంచి మాజీ ఎమమెల్యేలు, జిల్లాస్థాయి నాయకులు బీఆర్ఎస్‌లో చేరారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి గెలుస్తారన్న ధీమా వ్యక్తమవుతున్నది.


Next Story

Most Viewed