TSPSCలో ప్రక్షాళన షురూ

by Disha Web Desk 4 |
TSPSCలో ప్రక్షాళన షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. కొన్ని పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూనే ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించింది. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి పోస్టుకు తోడు అడిషనల్ సెక్రటరీ హోదాలో ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో పది కొత్త పోస్టుల్ని కూడా ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇకపైన జరిగే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో పటిష్టమైన మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగానే ఒకేసారి కొత్త పోస్టుల్లో నియామకాలతో పాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్‌ను నియమించడం గమనార్హం.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై పడ్డ మచ్చను తొలగించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయాలను తీసుకున్నది. పరీక్షల నిర్వహణకు కంట్రోలర్‌గా ఐఏఎస్ అధికారి సంతోష్ (అదనపు కార్యదర్శి బాధ్యతలు కూడా)తో పాటు డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సహాయకంగా జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామ్, కమిషన్‌లో లీగల్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక జూనియర్ సివిల్ జడ్జి హోదాలో ఉండేలా ఆఫీసర్‌ పోస్టుల్ని ప్రభుత్వం క్రియేట్ చేసింది. కమిషన్ పకడ్బందీ నిర్వహణ కోసం ఈ పోస్టుల్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనల తర్వాత ఉన్నత స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఉత్తర్వులు జారీ

ప్రస్తుతం పురపాలక శాఖలోని ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, స్పెషల్ కలెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా బీఎం సంతోష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంతోష్‌ను ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిషనల్ సెక్రటరీ పోస్టుతో పాటు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గానూ నియమించడంతో పాత బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం సాయంత్రం తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం పాత బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నామని, కొత్త పోస్టులో నియమితులు కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరవింద్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed