మౌనిక ఘటన: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిక్కుడు ప్రభాకర్ లేఖ

by Disha Web Desk 2 |
మౌనిక ఘటన: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిక్కుడు ప్రభాకర్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో తెల్లవారుజామున కురిసిన వర్షం, ఆ తర్వాత రోడ్లపై వచ్చిన వరద నీటితో సికింద్రాబాద్ కళాసిగూడ కాలనీలో 11 ఏండ్ల చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించడంపై రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించారని, పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టాలని ఆ లేఖలో కోరారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఏప్రిల్ 25 ను,చి 30 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ హెచ్చిరించినా ప్రభుత్వ అధికారులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని, చివరకు మౌనిక అనే బాలిక నాలాలో పడి చనిపోయిందని ఆ లేఖలో వివరించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేను ఆ లేఖలో కోరారు.

నాలాలో పడి మౌనిక చనిపోయిన సంఘటన మొదటిదేమీ కాదని, గడచిన నాలుగేళ్ళలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, పలువురు మహిళలు, పురుషులు కూడా కొట్టుకుపోయి చనిపోయారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వివక్షాపూరితమైన వైఖరి, సివిల్ పనుల పట్ల వారి ధోరణి ఆక్షేపణీయమని, మూతల్లేకుండా ఓపెన్ నాలాలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలేదని, మ్యాన్ హోల్ మూతల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో వివరించారు. ఈ చర్యలు చివరకు పౌరులకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు (ఆర్టికల్ 21)కు విఘాతం కలిగిస్తున్నాయని, ఇందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి శిక్షించేలా చూడాలని కోరారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించడంపై ఆలోచించాలని కోరారు.



Next Story