ప్రధాని మోడీకి అదానీ అత్యంత ఆప్తమిత్రుడు: కేసీఆర్

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీకి అదానీ అత్యంత ఆప్తమిత్రుడు: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తొలిసారి అదానీ ప్రస్తావన తెచ్చారు. రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఆయన కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎల్ఐసీ పెట్టుబడులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. అదానీ సంపాదన అనూహ్యంగా పెరిగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి అధ్యయనం చేయాలన్నారు. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలను లేవనెత్తిన కేసీఆర్ ఆ పార్టీ ఎజెండాను క్లుప్తంగా వెల్లడించారు. ఐదు రంగాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై 'రీ ఇన్వెంట్ ఇండియా' పేరుతో మీడియాకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీకి అదానీ అత్యంత ఆప్తమిత్రుడని, అందువల్లనే ఆయన అపరు కుబేరుడిగా మారారని అన్నారు. పారిశ్రామిక‌వేత్త అదానీపై మోడీకి ఉన్న ప్రేమ‌ దేశ ప్ర‌జ‌ల‌పై లేదని అన్నారు. ఒక సాధారణ వ్యాపారిగా ఉన్న అదానీ రెండేండ్ల వ్యవధిలోనే ఎదగడంపై యావత్తు దేశం ఇప్పుడు చర్చిస్తున్నదన్నారు. దేశంలో సుసంపన్నమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దిగుమతి పాలసీలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడం వెనక ఉన్న రహస్యమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. కేవలం అదానీ ఆర్థిక ప్రయోజనాల కోసమే బొగ్గు దిగుమతి పాలసీని మార్చాల్సి వచ్చిందన్నారు. మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోనే 150 సంవత్సరాల వరకు అవసరాలను తీర్చుకోవచ్చని, కిలో కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని, కానీ అదానీ సంపద పోగుపడడం కోసమే కేంద్రం విధానం మార్చిందన్నారు.

మహిళలకు 33% రిజర్వేషన్లు

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం ఉన్న స‌మాజం అద్భుతంగా ప్ర‌గ‌తి సాధిస్తుంద‌ని, అందువల్లనే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ విధానాన్ని ఏడాది కాలంలోపే అమ‌లు చేస్తామన్నారు. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని, అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యాన్ని పెంచుతామన్నారు. మ‌హిళ‌ల‌ పట్ల కేంద్రానికి చిన్న‌చూపు ఉన్నదని, బేటీ ప‌ఢావో.. బేటీ బ‌చావో నినాదం మాట‌ల‌కే ప‌రిమితమైందన్నారు. ఉత్తర భార‌త‌దేశంలోని పరిస్థితి చూస్తే ఈ నినాదం పస ఏంటో తెలిసిపోతుందన్నారు. హ‌థ్రాస్ ఘ‌ట‌నతో మ‌హిళ‌ల‌కు ఏ మేరకు ర‌క్షణ ఉన్నదో తేలిపోతుందన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యుత్ రంగం

దేశ ప్రగతికి విద్యుత్ రంగం చాలా కీలకమైనదని నొక్కిచెప్పిన కేసీఆర్ మొత్తం స్థాపిత సామర్థ్యం, ప్రజల వినియోగం తదితరాలపై లెక్కలను వివరించారు. ఈ రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి పోనివ్వడం ప్రజలకు భారంగామారుతుందని, అందువల్లనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తామన్నారు. న్యూయార్క్, లండన్ నగరాల్లో కరెంటు పోయినా హైదరాబాద్‌లో మాత్రం పోదన్నారు. హైద‌రాబాద్‌ నగరం ప‌వ‌ర్ ఐల్యాండ్‌గా మారిందన్నారు. తెలంగాణను చూస్తే విద్యుత్ రంగ నిర్వహణ ఎలా ఉండాలో తెలుస్తుందన్నారు. విద్యుత్ వ్యవస్థ ప్రైవేటుపరం అయితే దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు వస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ వ్యవస్థను ప్రైవేటుపరం చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయం చేస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ, జిందాల్ లాంటి బడా వ్యాపారులకు వంత పాడుతోందని ఆరోపించారు. అలాంటి వ్యక్తులకు లాభాలు చేకూర్చడానికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని అప్పనంగా అమ్మేస్తున్నదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేండ్ల‌లోనే దేశమంతటా నిరంత‌ర వెలుగులు తీసుకొస్తామన్నారు. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్నా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఎందుకు ఇబ్బంది పడుతున్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలో సైతం విద్యుత్‌ కొరత ఉన్నదని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా అనేక రంగాల్లో భారత్ వెనకబడి ఎందుకు ఉన్నదన్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మాటలతోనే రాజకీయ పార్టీలు కాలం నెట్టుకొస్తున్నాయన్నారు.

బొగ్గు దిగుమతి వెనక లోగుట్టు ఏంటి?

బొగ్గు గ‌నులు ఉన్న అన్ని ప్రాంతాల‌కు రైల్వే లైన్లు వేయడానికి కోల్ ఇండియా సంస్థ నిధులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేసీఆర్ ఆరోపించారు. థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌పై విదేశీ బొగ్గు దిగుమ‌తి చేసుకోవాల‌టూ కేంద్ర ప్రభుత్వం షరతు విధించిందని, విస్తారమైన నిల్వలు ఉన్నా ఈ జ‌బ‌ర్ద‌స్తీ విధానాన్ని ఎందుకు రుద్దుతున్నదని ప్రశ్నించారు. అదానీకి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డానికే బొగ్గు దిగుమ‌తి విధానంలో మార్పులు చేసి ఒత్తిడి తీసుకొస్తున్నదన్నారు. బొగ్గును దిగుమ‌తి చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మ లేదన్నారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇవి 125 ఏళ్లపాటు దేశమంతటికి విద్యుత్ ఇవ్వడానికి సరిపోతాయన్నారు. విద్యుత్‌ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించి నిర్వీర్యం చేయడానికి కేంద్ర కుట్ర పన్నుతున్నదన్నారు.

జలవిధానాన్ని సంపూర్ణంగా మార్చేస్తాం

దేశ జ‌ల విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, దీన్ని పూర్తిగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకోసం ఎవ‌రినీ ప్రాధేయ‌ప‌డాల్సిన అక్క‌ర్లేదని, నీటి వినియోగంపై బీఆర్ఎస్ ఎజెండా స్పష్టంగా ఉంటుంద‌న్నారు. దేశంలో సహజసిద్ధంగా ఉన్న నీటి వ‌న‌రుల‌కు కొద‌వే లేదని, అవ‌స‌రానికి మించి ఉన్నాయన్నారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ చెప్తున్న లెక్క‌లనే ప్రామాణికంగా తీసుకుంటే దేశంలోని ప్ర‌తి ఎక‌రా సాగుభూమికి నీటిని ఇవ్వొచ్చన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను, నీటి పంపిణీ ఏర్పాట్లను ట్రిబ్యున‌ళ్ల పేరుతో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి నాన్చుతున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. కృష్ణా జలవివాదాలపై బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ ఇరవై ఏండ్లయినా ఒక్క తీర్పునూ ఇవ్వ‌లేదని గుర్తుచేశారు. పుష్కలంగా వనరులు ఉన్నా తాగునీటి కోసం ప్ర‌జ‌లు తిప్పలు పడుతున్నారని, రోగాల పాల‌వుతున్నారని అన్నారు.

స్పష్టమైన విధానంతో వాడుకుంటే మన అవ‌స‌రాలకు సరిపోయిన తర్వాత 20 వేల టీఎంసీల నీళ్లు మిగులుతాయన్నారు. నీటి కొట్లాట‌పై మేధావులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేసీఆర్ సూచించారు. అనేక దేశాలు స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నాయన్నారు. జింబాబ్వే, ఈజిప్టు, కొలంబియా, చైనా, అమెరికా తదితర దేశాల్లో భారీ రిజ‌ర్వాయ‌ర్లు ఉన్నాయని, మ‌న దేశానికి అలాంటివి ఒక్క‌టి కూడా లేదన్నారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం రూపంలో లభిస్తున్నదని, దేశం మొత్తం సాగు అవసరాలకు 40 వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. దేశంలో సరిపడా జలాలు ఉన్నా రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని ప్రశ్నించారు. భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించటం లేదన్నారు.

ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అవసరం

దేశప్రగతి కోసం అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచనలు కావాలన్న కేసీఆర్ యువత, మేధావులు ఈ దిశగా ఆలోచించాలన్నారు. ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించిన కేసీఆర్.. బీఆర్ఎస్కు అధికారమిస్తే జలవిధానాన్ని పూర్తిగా మార్చేస్తామన్నారు. దేశంలో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను భారత్ ఎందుకు ఆకర్షించటం లేదని గుర్తుచేశారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1971లో చైనా జీడీపీ మన దేశం కంటే తక్కువేనని,క నీ ఇప్పుడు మనతో పోలిస్తే ఐదు రెట్లు బలపడిందని గుర్తుచేశారు. ఈస్ట్ ఏషియన్ టైగర్స్ గా పిలుచుకునే దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ ఏషియన్ దేశాలుగా పిలుచుకునే మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ అనేక రంగాల్లో వృద్ధి చెందాయన్నారు. దేశ ఆర్థిక వృద్ధి కోసం రీసెర్చి-డెవలప్‌మెంట్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాల్సి ఉందన్నారు.

సంస్కరణల బాట నేటి ఆవశ్యకత

దేశంలో గుణాత్మకమైన, ప్రబల మార్పు రావాలంటే కొన్ని రంగాల్లో సంస్కరణలను చేపట్టక తప్పదని 'రీ ఇన్వెంట్ ఇండియా' డాక్యుమెంట్ ద్వారా కేసీఆర్ నొక్కిచెప్పారు. ఎకనమిక్, కాన్‌స్టిట్యూషనల్, ఎలక్టోరల్, జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ అవసరమన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలను ఆకర్షించేందుకు నిర్దిష్టమైన విధానం ఉండాలన్నారు. చైనా తరహాలో సెజ్, స్థిరమైన పన్ను విధానం, చట్టాల్లో మార్పులు జరిగితే అప్పటి నుంచే అమల్లోకి రావడం లాంటివి అవసరమన్నారు. రాష్ట్రాలకు ఇప్పుడు వస్తున్న 41% డివొల్యూషన్ (రాష్ట్ర పన్నుల వాటా)ను 50% కి పెరిగేలా మార్పులు జరగాలన్నారు. శాశ్వత ఆర్థిక సంఘం ఉండాలన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి కలిపి ఎన్నికలు జరిగేలా జమిలి విధానం ఉండాలన్నారు. ఏదేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలన్నారు.


Next Story

Most Viewed