తెలంగాణ 7 విలీన మండలాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
తెలంగాణ 7 విలీన మండలాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలోని ఏడు మండలాలను గతంలో ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మండలాల విలీనంపై తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారాయి.

చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఏపీకి పోలవరం అతి ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేంద్రం పూర్తిగా సహకరించింది. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఎంపికైన సందర్భంగా ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ ఏడు మండలాలు అక్కడ ఉండి జూన్ 2న నోటిఫికేషన్ వస్తే గనుక ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పునరావాసానికి అంగీకరిస్తే తప్ప పోలవరం పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ రోజు తాను ఢిల్లీకి వెళ్లి నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడితో కలిసి ఆ ఏడు మండలాలను ఏపీకి ఇవ్వాలని కోరానన్నారు. ఒక వేళ మీరు ఈ ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను, ఈ పదవి తనకు వద్దని చెప్పేశానన్నారు. దీంతో ఇవన్నీ ఆలోచన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆర్డినెన్స్ జారీ చేసి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారు. ఇది ఓ చరిత్ర అన్నారు. ఆనాడు ఆర్డినెన్స్ ద్వారా ఈ మండలాలను ఏపీకి ఇవ్వకపోయి ఉండే పోలవరం ప్రారంభమయ్యేదే కాదు' అన్నారు.



Next Story

Most Viewed