కలెక్టర్ బదిలీతో ఆ జిల్లాలో జోరుగా సంబరాలు.. తీవ్ర చర్చనీయాంశంగా IAS తీరు!

by Disha Web Desk 19 |
కలెక్టర్ బదిలీతో ఆ జిల్లాలో జోరుగా సంబరాలు.. తీవ్ర చర్చనీయాంశంగా IAS తీరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ అయితే ఆ జిల్లాలో విపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు స్థాన చలనం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. ఓ కలెక్టర్‌పై స్థానికంగా ఇంతటి వ్యతిరేకత ఏంటనే చర్చ జోరుగా వినిపిస్తోంది. కలెక్టర్ బదిలీపై పటాకులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. ఇదివరకు చిన్న చితక అధికారుల విషయంలో ఇలాంటి సంబరాలు జరుపుకున్న సందర్భాలు ఉండగా.. ఓ కలెక్టర్ బదిలీ అయితే ఇంతలా సంతోషం వ్యక్తం చేయడం కొంత మంది ఐఏఎస్‌ల పనితీరుకు నిదర్శనంగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ అధికార పార్టీకి తొత్తుగా మారాడని, అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడని చాలా కాలంగా జిల్లాలోని విద్యార్థి సంఘాలు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అవినీతి అక్రమాలకు వత్తాసు పలకడంతో పాటు ఆధారాలతో సహా భయటపెట్టినా భూకుంభకోణాలను నివారించలేకపోయారని, ఇసుక అక్రమ రవాణా వంటి వాటి విషయంలో చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేయాలని గత కొంత కాలంగా డిమాండ్‌లు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. రాహుల్ రాజ్ బదిలీతో తమ పోరాటానికి ప్రభుత్వం ఆలస్యంగా అయినా చర్యలు తీసుకోవడం సంతోషకరం అంటూ విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాగా కొంత మంది ఐఏఎస్‌ల పని తీరుపై ఇటీవల ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన కలెక్టర్లు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల భూకబ్జాలపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. ఇది తమ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ప్రజాసేవలో ఎంతో ఉన్నతమైనదిగా భావించే ఐఏఎస్ పోస్టుకు సైతం కళంకం తీసుకువస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed