బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అతడిదే కీ రోల్.. CBI చార్జిషీట్‌‌లో సంచలన విషయాలు!

by Satheesh |
బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అతడిదే కీ రోల్.. CBI చార్జిషీట్‌‌లో సంచలన విషయాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీని లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా, ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా, లబ్ధి చేకూరేలా మార్పులు చేర్పులు చేసి తుది రూపు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుచ్చిబాబు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తగినన్ని ఆధారాలు లభించాయని పేర్కొన్నది.

సౌత్ గ్రూపు తరఫున బోయిన్‌పల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరులతో కలిసి యాక్టివ్ రోల్ పోషించారని ఆరోపించింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు పలు లిక్కర్ కంపెనీల యజమానులతో కలిసి చర్చలు జరిపారని, వీటికి సంబంధించిన ఆధారాలు బుచ్చిబాబు మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన వాట్సాప్ చాటింగ్‌ల ద్వారా లభ్యమైనట్లు పేర్కొన్నది.

బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో 2021 మార్చి 6న జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను సేకరించామని, ఎక్సయిజ్ పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఆమోదించడానికి ముందే రెండు సార్లు ఢిల్లీ వచ్చి పలువురితో చర్చించారని పేర్కొన్నది. ఎక్సయిజ్ పాలసీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్ హైదరాబాద్ పర్యటన (2021 మార్చి 6 నుంచి 9 మధ్యలో) సమయంలోనే ఆయన ఫోన్‌లో వాట్సాప్ యాప్ ద్వారా చాటింగ్ జరిగినట్లు వివరించింది.

దీనికి కొనసాగింపుగానే బుచ్చిబాబు ఢిల్లీ టూర్ మార్చి 14 నుంచి 17 మధ్యలో జరిగిందని స్పష్టత ఇచ్చింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో గత నెల 25న సమర్పించిన చార్జిషీట్‌లో ఈ విషయాలను ప్రస్తావించింది. ఈ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టు శనివారం వెల్లడించింది.

హైదరాబాద్‌లోని తాజ్ డక్కన్ హోటల్‌లో 2021 మార్చి 6న జరిగిన మీటింగ్‌కు విజయ్ నాయర్ హాజరయ్యారని, అందులో బుచ్చిబాబు కూడా పాల్గొన్నారని వివరించింది. ఆ తర్వాతనే ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో మూడు రోజుల పాటు కంటిన్యూగా మీటింగులు జరిగాయని, దీనికి కొనసాగింపుగా మార్చి 19న మరోసారి విజయ్ నాయర్ హైదరాబాద్ వచ్చారని వివరించింది.

అదే రోజున జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలను (2021 మార్చి 20) బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవర్ చేసినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో వెల్లడించింది. బుచ్చిబాబు మొబైల్ ఫోన్‌కు ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ డ్రాఫ్టు కాపీ ఎక్సయిజ్ శాఖకు చెందిన అధికారి (ఆ శాఖ మంత్రి మనీష్ సిసోడియాకు పీఎస్‌గా వ్యవహరించిన ఆఫీసర్) వాట్సాప్ ద్వారానే అందిందని ఆరోపించింది.

డ్రాఫ్టు కాపీలో లేని వివరాలు ఆ తర్వాత చేరాయని, సరిగ్గా ఈ వివరాలే బుచ్చిబాబు మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లలో దొరికాయని సీబీఐ పేర్కొన్నది. సౌత్ గ్రూపు తరఫున బుచ్చిబాబుతో పాటు అభిషేక్, అరుణ్ పిళ్ళై, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కూడా పలు మీటింగుల్లో కలిసి పాల్గొన్నట్లు తెలిపింది.

ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో రూమ్ ఎవరి పేరుతో బుకింగ్ అయిందో, దానికి బిల్లుల్ని ఎవరు చెల్లించారో, ఆ మూడు రోజుల పాటు ఎవరెవరు బస చేశారో వివరాలన్నింటినీ హోటల్ రికార్డుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అరబిందో శరత్‌చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి కూడా ఆ సమయంలో హోటల్‌లోనే ఉన్నారని, జెట్ సెట్ గో పేరుతో ఆమె నిర్వహిస్తున్న కంపెనీ ద్వారానే రూమ్‌లు రిజర్వు అయినట్లు కొన్ని వివరాలను చార్జిషీట్‌లో సీబీఐ వివరించింది.

కరోనా ఆంక్షలు పటిష్టంగా అమలవుతున్న సమయం (2021 మే నెలలో)లోనే అరబిందో శరత్‌తో కలిసి చార్టర్డ్ ఫ్లైట్‌లో పై నలుగురూ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశారని సీబీఐ పేర్కొన్నది. ఢిల్లీలోని కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి (తుగ్లక్ రోడ్డు) సమీపంలోని క్లారిడ్జ్ హోటల్‌కు దగ్గర్లోని గౌరరీ అపార్టుమెంటులో 2021 మే 21న విజయ్ నాయర్‌తో కలిసి పై నలుగురూ చర్చించుకున్నట్లు వివరించింది.

ఎక్సయిజ్ పాలసీలో మార్పులు చేర్పులు, కుట్రకు వ్యూహ రచనకు ఈ అపార్టుమెంటు కూడా ఒక వేదికగా మారిందని, ఆ తర్వాతనే డ్రాఫ్టు పాలసీలో అనూహ్యంగా సవరణలు జరిగాయని సీబీఐ పేర్కొన్నది. ఎక్సయిజ్ పాలసీకి మార్పులు చేర్పులు చేయాల్సిందిగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సిఫారసులు చేసింది కూడా ఈ సమయంలోనే (2021 మే 20-21 తేదీల్లో) అని సీబీఐ నొక్కిచెప్పింది.

సౌత్ గ్రూపు తరఫున రూ. 90-100 కోట్ల మధ్య డబ్బు మార్పిడి జరిగినట్లు దినేష్ అరోరా కూడా తన స్టేట్‌మెంట్లలో పేర్కొన్నారని సీబీఐ తెలిపింది. ఇందులో రూ. 30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి సమకూర్చగా హవాలా మార్గంలో వాటిని అందుకుని విజయ్ నాయర్‌కు అప్పజెప్పినట్లు కూడా తన వాంగ్మూలంలో దినేష్ అరోరా అంగీకరించినట్లు వివరించింది.

ఎక్సయిజ్ పాలసీలో బుచ్చిబాబు పోషించిన పాత్రకు అభిషేక్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ ఎండీ ఖాతా నుంచి పలు దఫాలుగా డబ్బులు ముట్టినట్లు సీబీఐ కొన్ని వివరాలను ఆ చార్జిషీట్‌లో పొందుపరిచింది. ఒకసారి రూ. 55 లక్షలు, మరోసారి రూ. 40 లక్షలు, ఇంకోసారి రూ. 15 లక్షలు చొప్పున ముత్తా గౌతమ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి బుచ్చిబాబుకు ముట్టినట్లు తెలిపింది.

ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కుట్రకు పాల్పడ్డారని, ఆయనతో పాటు మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధల్ తదితరులపై నమోదైన ఐపీసీలోని సెక్షన్ 120-బీ (రెడ్ విత్ 201), 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 8, 12 సమంజసమైనవేనని సీబీఐ స్పష్టం చేసింది. ఈ సెక్షన్ల కింద వీరు నేరానికి పాల్పడినట్లు ధృవీకరించే అన్ని సాక్ష్యాలు, ఆధారలను చార్జిషీట్‌లో పొందుపరిచామని నొక్కిచెప్పింది.

వీటి ప్రకారం స్పెషల్ కోర్టు వారిపై ట్రయల్ జరపాలని విజ్ఞప్తి చేసింది. మరికొద్దమందికి కూడా ఈ కుట్రతో సంబంధం ఉన్నదని పేర్కొన్న సీబీఐ రానున్న రోజుల్లో వారికి సంబంధించిన అనుబంధ చార్జిషీట్లను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed