మూడు MP స్థానాలకు అభ్యర్థులు అనౌన్స్.. 17 స్థానాల్లో కాంగ్రెస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఇదే..!

by Disha Web Desk 4 |
మూడు MP స్థానాలకు అభ్యర్థులు అనౌన్స్.. 17 స్థానాల్లో కాంగ్రెస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుందనగా కాంగ్రెస్ పార్టీ మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్ నుంచి సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ముగ్గురూ నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫామ్ అందుకుని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించడమే మిగిలింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఏఐసీసీ తెర దించింది. ఊహించినట్లుగానే ఖమ్మం స్థానానికి రఘురామ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు పేర్లు ఖరారయ్యాయి. ఈ రెండు స్థానాల్లో సామాజిక సమీకరణాలకు ప్రత్యేకత ఉన్న పరిస్థితుల్లో ఏఐసీసీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

ఈ ముగ్గురి పేర్లను ప్రకటించడంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లయింది. నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తున్నందున ఇక ప్రచారం మొదలుపెట్టడమే తరువాయి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో అభ్యర్థులెవరో తెలియకపోవడంతో ప్రచారం లాంఛనంగా ప్రారంభం కాలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరావు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేసినా ఇప్పుడు లాంఛనంగా రఘురామ్‌రెడ్డి పేరును ఖరారు చేయడంతో వారు బరి నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. కరీంనగర్‌లో సైతం టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ రాజేందర్‌రావును ఏఐసీసీ ఫైనల్ చేయడంతో ప్రవీణ్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.

ఉత్కంఠ రేకెత్తించిన ఖమ్మం సెగ్మెంట్

ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డిని నిలబెట్టాలని భావించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీకి కూడా వివరించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం తన భార్య నందిని పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారు. వీరిద్దరూ పార్టీకి కావాల్సిన ముఖ్యమైన నేతలు కావడంతో టికెట్ ఎవరికి వస్తుందోననే చర్చ జోరుగానే సాగింది. ఒక దశలో ఖరారు చేయడం ఏఐసీసీకి శక్తికి మించిన పనిగా మారింది. దీంతో వారిద్దరినీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీకి పిలిపించుకుని చర్చించారు. ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా సూచించారు. చివరకు ఇద్దరి మధ్య విభేదాలకు తావు లేకుండా రఘురామ్‌రెడ్డిని ఫైనల్ చేశారు.

మంత్రి పొంగులేటికి వియ్యంకుడు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డిని నిలబెట్టాలని భావించినా చివరకు ఆయన వియ్యంకుడైన రఘురామ్‌రెడ్డికి అవకాశం లభించింది. రఘురామ్ రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డికి ఈ జిల్లాలో గణనీయమైన గుర్తింపు ఉన్నది. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయాలు రాష్ట్ర నేతల నుంచి ఏఐసీసీకి వెళ్ళాయి. అందులో భాగంగానే పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు తదితరుల పేర్లు చర్చల్లో నలిగాయి. కమ్మ వర్సెస్ రెడ్డి అనే చర్చ కూడా జరిగింది. కమ్మ కోటలో రెడ్డి అభ్యర్థి అనే మాటలు వినిపిస్తున్నా ఈ ఎంపీ సెగ్మెంట్‌లోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు రఘురామ్‌రెడ్డి కూడా గెలవడం ఖాయమనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.

కరీంనగర్‌లో ట్రయాంగిల్ ఫైట్

కరీంనగర్ నియోజకవర్గంలో వెలిచాల రాజేందర్‌రావును కాంగ్రెస్ పైనల్ చేయడంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అనివార్యమవుతున్నది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. వినోద్ కుమార్, రాజేందర్‌రావు ఒకే సామాజికవర్గానికి (వెలమ) చెందినవారు కావడంతో ఓటు బ్యాంకు చీలుతుందనే చర్చ ఈ నియోజకవర్గంలో మొదలైంది. అది బీజేపీ అభ్యర్థికి ఏ మేరకు లాభిస్తుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు కమలనాధులు. రాజేందర్‌రావు పేరును ఏఐసీసీ లాంఛనంగా ఖరారు చేయడానికి రెండు రోజుల ముందే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నామినేషన్ వేశారు. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నందునే నామినేషన్ వేస్తున్నట్లు మంత్రి పొన్నం ఓపెన్‌గానే మీడియాకు వివరించారు.

హైదరాబాద్‌ సీటు డీసీసీ ప్రెసిడెంట్‌కే

హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ ఆచితూచి అడుగేసింది. ఇక్కడ ముస్లిం, నాన్-ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. తబుస్సుమ్, మస్కతి ఐస్ క్రీమ్ అధినేత తదితరుల పేర్లు వినిపించాయి. చివరకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సమీర్ వలీ ఉల్లా ఖాన్ వైపే ఏఐసీసీ మొగ్గు చూపింది. మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) మద్దతుతో పోటీ చేయడానికి అంజాదుల్లా ఖాన్ ఆసక్తి చూపారు. కానీ ఆ రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకపోవడంతో పోటీ చేయడం లేదని అంజాదుల్లా ఖాన్ ప్రకటించారు. డీసీసీ ప్రెసిడెంట్ సమీర్‌నే ఏఐసీసీ ఫైనల్ చేసింది.

సగం జనరల్ స్థానాలు ‘రెడ్డి’లకే

రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో రెండు ఎస్టీ, మూడు ఎస్సీకి రిజర్వు అయ్యాయి. మిగిలిన పన్నెండు జనరల్ స్థానాల్లో ఏడుగురు ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే (కాంగ్రెస్ తరఫున) పోటీ చేస్తున్నారు. ఒకటి వెలమ, ఒకటి ముస్లిం మైనారిటీ, ముగ్గురు బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో క్యాస్ట్ ఈక్వేషన్ దృష్ట్యా ఒకదానితో మరొకటి ముడిపడి ఉండడంతో రెండింటినీ ఒకేసారి ఖరారు చేయాల్సి వచ్చింది. మొదటి నుంచీ ఒకటి రెడ్డి, మరొకటి వెలమ అభ్యర్థులకు ఇవ్వొచ్చన్న చర్చలు జరిగాయి. లేదా ఒకటి బీసీ, మరొకటి కమ్మ అనే చర్చలూ జరిగాయి. కానీ చివరకు నేతల మధ్య విభేదాలకు తావు లేకుండా రెడ్డి, వెలమ అభ్యర్థుల్ని ఏఐసీసీ ఫైనల్ చేసింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల (ఉమ్మడి) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ఏఐసీసీ ఫైనల్ చేసింది. ఇంతకాలం ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్‌కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్ ప్రాతినిధ్యం వహించారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో సైతం తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ లాంఛనంగా తీన్మార్ మల్లన్న పేరును ఖరారు చేయడానికి కొన్ని నెలల ముందు నుంచే ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.



Next Story

Most Viewed