బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీ, 24 అవర్స్ సెక్యూరిటీ.. అయినా CM KCR నో విజిట్!

by Disha Web Desk 4 |
బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీ, 24 అవర్స్ సెక్యూరిటీ.. అయినా CM KCR నో విజిట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలు మినహా రాష్ట్రంలోని 104 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం క్యాంపు ఆఫీసులను నిర్మించింది. ఒక్కో క్యాంపు కార్యాలయానికి రూ. కోటి ఖర్చు చేసింది. రోడ్లు భవనాల శాఖ రూపొందించిన డిజైన్‌నే అన్ని సెగ్మెంట్లలో అమలుచేసింది. గజ్వేల్‌లో సైతం 2017 ఫిబ్రవరి 3న ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ అక్కడ క్యాంపు ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఏడాది కాలంలో నిర్మాణం పూర్తికావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తుది మెరుగులు దిద్దుకునే సమయంలో 2018 జనవరి 17న కేసీఆర్ సందర్శించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ్ సూచనల ప్రకారం పూర్తి వాస్తు నిబంధనల మేరకు రెండు అంతస్తుల్లో క్యాంప్ ఆఫీసు భవనం నిర్మాణమైంది.

ప్రతి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికీ రూ.కోటి బడ్జెట్ కేటాయిస్తే, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు రూ.3కోట్లను సర్కారు సమకూర్చింది. 24 గంటల సర్వియలెన్స్, భవనం చుట్టూ ప్రహరీగోడ, భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం, ఏకకాలంలో 150 మందితో సమావేశమయ్యేలా గ్రౌండ్ ఫ్లోర్‌లో పెద్ద మీటింగ్ హాల్, మొదటి అంతస్తులో బస చేసే విధంగా ఆఫీస్ కమ్ రెసిడెన్స్ విధానంలో ఈ భవనం నిర్మాణమైంది. ఈ భవనాన్ని మంత్రిగా హరీశ్‌ రావు 2018 మార్చి 8న ప్రారంభించారు.

సకల హంగులతో..

అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు సగటున 600 చ.గజాల విస్తీర్ణంలోనే ఉన్నా, గజ్వేల్‌లో మాత్రం ముఖ్యమంత్రి ఉండే ఆఫీసు కావడంతో 4వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. భద్రతాపరంగా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాల్సి వచ్చిందని జిల్లా అధికారులు అప్పట్లో వివరించారు. ముదిరాజుపల్లి వెళ్లే దారిలో మెయిన్‌రోడ్డుపైనే నిర్మించామని, సీఎం కాన్వాయ్ అవసరాలతో పాటు ఆయనను కలవడానికి వచ్చే సందర్శకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని విశాలమైన పార్కింగ్, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా సెక్యూరిటీ కోణం నుంచే నిర్మించామని చెప్పారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ భవనాన్ని నిర్మించినా చివరకు అలంకారానికే పరిమితమైంది.

సమావేశం కాని సీఎం

లాంఛనంగా ఈ క్యాంపు కార్యాలయం అందుబాటులోకి వచ్చినా, ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజలతో అక్కడ సమావేశం నిర్వహించలేదు. నిజానికి ప్రజల సమస్యలను తెలుసుకోడానికి, నియోజకవర్గ అభివృద్ధి గురించి స్థానికులతో చర్చించడానికి క్యాంపు ఆఫీసు అవసరమని భావించి విధాన నిర్ణయం తీసుకుని నిర్మించినా అది ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడంలేదు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు వెళ్లినా, ఆయన ఎర్రవెల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లోనే బస చేస్తున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి ఎంటర్ కాలేదు. కోట్ల రూపాయల ఖర్చుతో కట్టుకున్నా ఆయన వచ్చింది లేదని, సమస్యలను చెప్పుకోవడానికి ఆయనను కలిసే అవకాశమూ లేదని నియోజకవర్గ ప్రజలే అనేక సందర్భాల్లో గుసగుసలాడుకున్నారు. ఎర్రవల్లిలోని సొంత ఫామ్ హౌజ్‌కు వెళ్లే ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును పరిసరాల నుంచే వెళ్తున్నా.. ఎన్నడూ దాని లోపలికి వెళ్లకపోవడాన్ని అక్కడి స్థానిక ప్రజలు గుర్తుచేశారు. నిత్యం సెక్యూరిటీ సిబ్బంది ఉంటారని, అప్పుడప్పుడూ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఒంటేరు యాదవరెడ్డి మాత్రం వచ్చిపోతూ ఉంటారని, సీఎం గడచిన ఐదేళ్లలో ఆయన పెద్దగా క్యాంపు ఆఫీసుకు రాలేదని గుర్తుచేశారు.

Next Story