బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ స్పీచ్ ఇదే!

by Disha Web Desk 4 |
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ స్పీచ్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పుట్టుక నీది..చావు నీది.. బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ రచనలతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ ప్రజల ఆశీర్వాదాలు, సీఎం నైపుణ్య పాలనతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు.

రాష్ట్రంలోని గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, తమ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయిందని, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారుతోందని, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే లక్ష్యం కోసం ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల పంట పెట్టుబడిగా ఇచ్చామని, రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామన్నామని, రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెప్పారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. నా ప్రభుత్వం చేసిన కృషి కారణంగా 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం సగటున రూ.1,24,104 ఉంటే అది 2022-23 నాటికి రూ.3 లక్షల 17 వేల 115 పెరిగిందన్నారు. మూడున్నరేళ్ల రికార్డు సమయంలో కాళేశ్వరం నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. దళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం యావత్ దేశానకి దిక్సూచిగా నిలిచిందన్నారు. అసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ పెంచామన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందిస్తున్నదని ఇప్పటి వరకు 12 లక్షల మంది లబ్ధిదారులకు, 469 మంది ఆడ పిల్లల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని, పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసిందన్నారు. జర్నలిస్టుల కోసం రూ.100 కోట్లతో న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుందని తెలిపారు.

రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోందని ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను ఒకే సారి భర్తీ చేస్తున్నదని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2014 నుంచి 2022 వరకు ప్రత్యక్ష నియమకాల ద్వారా 1,41,735 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 2,21,774 ఉద్యోగ నియామకాలు జరపడం తెలంగాణ చరిత్రలో ఒక అపరూపమైన ఘట్టం అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు నేతన్న బీమా పథకం, ద్వారా జీవిత బీమా కల్పిస్తున్నామన్నారు.

Next Story

Most Viewed