'గువ్వలకు కేటీఆర్ స్క్రిప్ట్.. ఓటమి భయంతోనే ఆర్ఎస్పీపై ఆరోపణలు'

by Disha Web Desk 13 |
గువ్వలకు కేటీఆర్ స్క్రిప్ట్.. ఓటమి భయంతోనే ఆర్ఎస్పీపై ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు మంత్రి కేటీఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌లో భాగంగా చదివారని బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ క్వీన్ ఎద్దేవా చేశారు. దొరల దగ్గర చెంచాలుగా, బానిసలుగా పని చేస్తూ.. ఫాం హౌస్‌లో అమ్ముడుపోయిన గువ్వల బాలరాజు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరం అని వారు విమర్శించారు.

మంగళవారం బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ బలపడడం చూసి, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామోనన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. బీఎస్పీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల వలే ఫాంహౌస్‌లో బీజేపీకి అమ్మకానికి పోలేదని, లిక్కర్ స్కాం చేసి అరెస్టు కాకుండా లోపాయికారి ఒప్పందం చేసుకోలేదని వారు విమర్శించారు.

ఏనాడు కూడా ఒక గురుకుల పాఠశాలకు వెళ్లి చూడకుండా, విషాహారం తిని అనారోగ్య బారిన పడిన విద్యార్థులను పట్టించుకోకుండా ఇప్పుడు గురుకులాల మాజీ సెక్రటరీ అవినీతికి పాల్పడ్డారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కోట్ల విలువైన ఆస్తులు, ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ దందా గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఎన్ కౌంటర్ చేశారనే ఆరోపణలపై దమ్ముంటే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బీజేపీ పార్టీని వెలుగులోకి తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ కి అసలైన బీ టీమ్ బీఆర్ఎస్ అంటూ విమర్శించారు. దమ్ముంటే ఆర్ఎస్పీ పై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే ముక్కు నేలకు రాసి, అమరవీరుల స్థూపం వద్ద క్షమాపణ కోరాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పసుపుల బాలస్వామి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీల్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చాట్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed