మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ బీఎస్పీ.. మేము అమలు చేసేది ఇదే.. : ఆర్ఎస్పీ

by Disha Web Desk |
మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ బీఎస్పీ.. మేము అమలు చేసేది ఇదే.. : ఆర్ఎస్పీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నాణ్యమైన విద్య లభించడం లేదని, విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే లక్ష్యంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన భారత కాలమాన ప్రకారం ఆదివారం వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలకులు వారి ఫాంహౌజ్‌లు, కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్నారని, నిరుద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కొత్త పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు కనిపిస్తాయని, దీంతో చాలా మంది మద్యానికి బానిసలై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అల్లర్లు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిండు గర్భిణిపై అత్యాచారం చేసిన నిందితులను ఒక పార్టీ వారు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీఎస్పీ పార్టీ ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయదని, దానిని మేము నమ్మమని అన్నారు. మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ బీఎస్పీనే అని, రాజ్యాంగాన్ని మాత్రమే నమ్ముతూ దానిని మాత్రమే అమలు చేస్తామని తెలిపారు.

తాను గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలు నిర్విరామంగా విద్యావిధానాన్ని తెలుసుకోవడం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సందర్శించారని గుర్తు చేశారు. బడుగు, బలహీన, దళిత జాతికి చెందిన విద్యార్థులలో చదువుపై ఉన్న భయందోళనలు తొలగిపోవాలని స్వేరోగా పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థులు నిర్భయంగా జీవించడానికి, వారి ఆత్మవిశ్వాసం పెంచడానికి స్వేరో 'టెన్ కామాండ్స్' ఎంతో ఉపయోగపడిందన్నారు. తను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మహిళల కోసం 45 కళాశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

Next Story