ఖమ్మం పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ‘‘పాలేరు’’.. ఆ ఇద్దరు నేతల ఎంట్రీతో జిల్లాలో పొలిటికల్ హీట్!

by Disha Web Desk 19 |
ఖమ్మం పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ‘‘పాలేరు’’.. ఆ ఇద్దరు నేతల ఎంట్రీతో జిల్లాలో పొలిటికల్ హీట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరు లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పావులు కదుపుతుంటే, మరొకరు కామ్రేడ్లకు సపోర్ట్‌గా ప్రణాళికలు రచిస్తున్నారు. పాలేరు సీటును వదులుకోవద్దని సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులతో ఓ ఎమ్మెల్సీ ఈ మధ్య హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అనుచరులు గుస్సాగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. పాలేరు సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అనుచరులు సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.

పాలేరు సీటుపై ఎమ్మెల్సీ ప్రత్యేక భేటీ

ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీ ఈ మధ్య హైదరాబాద్‌లో పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ముఖ్యమైన లీడర్లతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇప్పించే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తన ప్రమేయం లేకుండా ఆ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ‘లెఫ్ట్ పార్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచన సీఎం‌కు లేదు.. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. ఈలోపు వారికి కావాల్సిన వర్క్స్ మాత్రమే చేస్తారు.

పాలేరు టికెట్ సీపీఎంకు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దు. ధైర్యంగా టికెట్ కోసం ట్రై చేయాలి.’ అని ఆ మీటింగ్‌లో సదరు ఎమ్మెల్సీ కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా వామపక్షాలతో పొత్తుల విషయమై చర్చించాల్సి వస్తే తనకు తెలియకుండా జరగదని చెప్పినట్లు సమాచారం. వారితో చర్చించే బాధ్యతను కూడా సీఎం తనకే ఇస్తారని చెప్పినట్లు తెలిసింది. ఏదో ఒక సీటు కావాలని సీపీఎం పట్టుబడినా, ఏదో ఒక రిజర్వ్ సీటు ఇచ్చే అవకాశముందని వివరించినట్లు సమాచారం.

లెఫ్ట్ పార్టీల‌కు సపోర్టుగా ఉత్తర తెలంగాణ మంత్రి!

జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి లెఫ్ట్ పార్టీలను ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటును సీపీఎం, కొత్తగూడెం సీటును సీపీఐ అడగాలని ఆ రెండు పార్టీలకు చెందిన స్టేట్ లీడర్లపై ఆయన ఒత్తిడి పెడుతున్నట్టు తెలిసింది. ఎన్నికల కోసం కావాల్సిన వనరులను కూడా సమకూరుస్తానని ఆయన భరోసా కూడా ఇచ్చినట్టు చర్చ ఉన్నది.

లెఫ్ట్ పార్టీలపై సదరు మంత్రికి ప్రేమ పుట్టడానికి ఆయన రాజకీయ స్వార్థం దాగుందని పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం స్థానాలు మాత్రమే జనరల్. మిగతావి రిజర్వ్ స్థానాలు. పాలేరు, కొత్తగూడెం స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వెళ్తే, వచ్చే గవర్నమెంట్‌లో కేబినెట్‌లో బెర్త్‌కు ఎలాంటి పోటీ ఉండదని సదరు మంత్రి ధీమాతో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఖమ్మం.. అప్పుడూ, ఇప్పుడూ టెన్షనే

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి పూర్తి పట్టురాలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం కొత్తగూడెంలో గెలిస్తే, 2018 ఎన్నికల్లో ఖమ్మంలో మాత్రమే విజయం సాధించింది. ఈసారి ఆ జిల్లా రాజకీయాల్లో పట్టున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి గులాబీ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకుని తిరుగుతున్నారు.

దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయోనని ఆ పార్టీ పెద్దలకు టెన్షన్ పట్టుకున్నది. అందుకే అక్కడ ఉన్న లెఫ్ట్ పార్టీల సపోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే ఎమ్మెల్యే సీటు లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ ఆ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అసలు బోణీ కొడుతామా? అనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతున్నది.



Next Story

Most Viewed