సెంటిమెంట్‌తో రాజకీయం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటు : పొన్నాల లక్ష్మయ్య

by Disha Web Desk 13 |
సెంటిమెంట్‌తో రాజకీయం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటు : పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్​పార్టీలు రెండూ ఒకటేనని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య పేర్కొన్నారు. గాంధీభవన్​లో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. సహారా, దొంగ పాస్​పోర్టు కేసుల విచారణ ఏమైందని..? ప్రశ్నించారు. ఈడీ వెంటనే ఆ స్కామ్​లకు సంబంధించిన వివరాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. సెంటిమెంట్‌తో రాజకీయం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిపోయిందని, ప్రజలు పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేసీఆర్​చెప్పే దొంగ మాటలు నమ్మితే నష్టపోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్​కేసులో భాగస్వాములు, అందులోని కంపెనీలు, ప్రధాన పాత్రధారుల్లో కొంత మందిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ​చేయడం మంచిదేనని, కానీ కేసును నీరు గారకుండా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉన్నదన్నారు.

2014లోనే కేసీఆర్​జైలుకు పోవడం ఖాయమని తాను చెప్పానని, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈడీ జాప్యం చేస్తున్నట్లు ఆయన వాపోయారు. నరేంద్ర మోడీ, అమిత్‌ షా, నడ్డా కలసి తెలంగాణలో అవినీతి భయంకరంగా ఉందని ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని పొన్నాల ప్రశ్నించారు. కాళేశ్వరం ఒక ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​షా అన్నారని.. కానీ దానిపై ఎంక్వైరీ లేదన్నారు. ఫామ్​హౌస్​కేసు కూడా నీరుగారిందన్నారు. అది ఎందుకు బయటకు రావట్లేదనేది అర్థం కావడం లేదన్నారు.

Next Story