నోరెత్తితే సస్పెండే.. అసెంబ్లీలో BRS వ్యూహం ఇదే!?

by Disha Web Desk |
నోరెత్తితే సస్పెండే.. అసెంబ్లీలో BRS వ్యూహం ఇదే!?
X

అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఫిబ్రవరిలో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. అయితే ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు లేవనెత్తకుండా అధికార పార్టీ స్కెచ్ వేస్తున్నది. తక్కువ సమయమివ్వడం, ఆందోళన చేస్తే సభ నుంచి సస్పెండ్ చేయడం వంటి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సమస్యలను లేవనెత్తితో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఆలోచనతో.. అధికార పార్టీ ఈ వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫిబ్రవరిలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నది. క్వశ్చన్ అవర్‌లో చర్చలో సైతం ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది, పది నెలల సమయం మాత్రమే ఉన్నది. ఈ తరుణంలో ప్రతిపక్షాలు సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కువవుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. ప్రతిపక్షాలను ఒకవేళ మాట్లాడించాల్సి వచ్చినా, ఒకటీ, రెండు నిమిషాలకే పరిమితం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది.

ఈటలపై స్పెషల్ ఫోకస్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే 6 నిమిషాల వ్యవధిలోనే ఈటలను సస్పెండ్ చేశారు. ఆ సెషన్ అంతా పాల్గొనకుండా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తరఫున రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండటంతో మళ్లీ ఈటలను కట్టడి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే మళ్లీ సస్పెండ్ చేయాలని అధినేత ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కూడా కన్నేసి ఉంచాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. రాజాసింగ్‌ను ఇప్పటికే బీజేపీ సస్పెండ్ చేయగా, ఆయన ప్రజాసమస్యలను లేవనెత్తుతారా? సైలెంట్‌గా ఉండిపోతారా అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్నది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తక్కువ టైమ్?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. అయితే వారికి సైతం తక్కువ సమయం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రశ్నోత్తరాల సమయంలోనూ, అంశాలపై చర్చల సందర్భంగా సైతం ఎక్కువ సమయం ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకైనా మాట్లాడేందుకు ఎక్కువ సమయమిస్తారా లేదా అనేది చూడాల్సిందే. అంతేకాకుండా భట్టి మాట్లాడినా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మాట్లాడతారా? సమస్యలను ప్రస్తావిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.



Next Story