BREAKING : కేసీఆర్‌కు బిగ్ షాక్.. విద్యుత్ ఒప్పందంపై నోటీసులు

by Rajesh |
BREAKING : కేసీఆర్‌కు బిగ్ షాక్.. విద్యుత్ ఒప్పందంపై నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చత్తీస్‌గడ్ విద్యుత్ కొనుగోళ్ళ అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీచేసింది. జూన్ 15వ తేదీకల్లా వివరణ పంపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కన్నది. కానీ జూలై 30 వరకు కుదరదంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని, కానీ ఎంక్వయిరీకి ఉన్న సమయాభావం రీత్యా గడువు లోగా పంపించాల్సిందేనని మరోసారి ఆయనకు వివరణ పంపినట్లు జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. కేసీఆర్‌తో పాటు మరో 24 మందికి కూడా నోటీసులు ఇచ్చామని, వారి నుంచి కూడా వివరణలు వస్తున్నాయని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రాసెస్‌ను అవలంబించకుండానే ఫైనల్ చేశారనే ప్రాథమిక నిర్ధారణ జరగడంతో కాంట్రాక్టుకు సంబంధించి బీహెచ్‌ఈఎల్ అప్పటి, ఇప్పటి సీఎండీలతోనూ కమిషన్ ఇంటరాక్ట్ అయినట్లు జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. ఏ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చారో వారి నుంచి వివరణ తీసుకున్నామన్నారు.

చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ప్రక్రియలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 కాలంలో టెండర్‌లను పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలోనే ఫైనల్ చేసిందని జస్టిస్ నర్సింహారెడ్డి మీడియాకు వివరించారు. కేసీఆర్ సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేవని కమిషన్ భావించినట్లయితే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందిగా కోరుతామన్నారు. నోటీసులు అందుకున్న పాతికమందిలో కేసీఆర్ ఒక్కరే రాజకీయ నాయకులు. మిగిలిన 24 మంది ఈ మూడు అంశాలతో సంబంధం ఉన్న అధికారులే. ఈ మూడు అంశాలతో సంబంధం ఉన్న అధికార, అనధికారుల నుంచి వివరాలను కోరుతున్నామని, అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకుంటున్నామన్నారు. నోటీసులకు వారు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా తదుపరి చర్యలుంటాయన్నారు. టెండర్ విధానాన్ని ఫాలో కాకుండా డైరెక్ట్ నెగోషియేషన్స్ ద్వారా అప్పటి ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకున్నదని జస్టిస్ నర్సింహారెడ్డి వివరించారు.



Next Story

Most Viewed