దేశంలోనే మొదటి ‘బ్రాహ్మణ సదన్’.. 31న ప్రారంభం

by Disha Web Desk 12 |
దేశంలోనే మొదటి ‘బ్రాహ్మణ సదన్’.. 31న ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ గోపనపల్లి లో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ నెల 31న ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్’ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ నేపథ్యంలో చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమౌతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని అన్నారు. స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనుక ఇదే తాత్వికత ఇమిడి ఉన్నదని తెలిపారు. నేడు తెలంగాణ ఆధ్యాత్మిక తెలంగాణ గా మారిందని, దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు.

దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు పురోహితులు వేద పండితులు వలస వస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలతో పాటు నేడు తెలంగాణ బ్రాహ్మణులకు ఉపాధి కేంద్రంగా మారిందన్నారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సుమారు 6500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. కాగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు అధనంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పేద బ్రాహ్మణులకు ఆసరా అందించేలా రూపొందించాలని సిఎం అన్నారు. ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించిన సమాచారాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించి పుస్తకాలు, డిజిటల్ రూపంలో భద్రపరచి అందరికీ అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి, ఉపాధ్యక్షుడు వనం జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed