బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించేది ఇవాళే.. చీఫ్ గెస్ట్‌గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

by Disha Web Desk 2 |
బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించేది ఇవాళే.. చీఫ్ గెస్ట్‌గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ మేరకు మంగళవారం నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నుంచి మొదలుకుని మార్చి 2వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. మొత్తం 12 రోజుల పాటు ఈ విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది. ఐదు క్లస్టర్లలో రథయాత్రలు చేపట్టనున్నారు. నాలుగు క్లస్టర్లలో యాత్ర మంగళవారం ప్రారంభం కానుంది. మేడారం జాతర నేపథ్యంలో కాకతీయ భద్రకాళి క్లస్టర్ యాత్ర ఆలస్యం కానుంది.

వేల కిలోమీటర్ల యాత్ర

ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. మొత్తం 4,238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొననున్నారు. పదేళ్లలో ప్రధాని మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. కార్నర్​ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరుకానున్నారు.

యాత్రల ప్రారంభం.. ముగింపు

కొమురం భీం క్లస్టర్: ఆదిలాబాద్ జిల్లా బాసర అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్‌లో యాత్ర ప్రారంభోత్సవానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరవుతున్నారు. ఈ యాత్ర.. 21 అసెంబ్లీ నియోజకవర్గాలను, 3 పార్లమెంటు నియోజకవర్గాలు (ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి) కవర్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు కొనసాగుతుంది.

రాజరాజేశ్వరి క్లస్టర్: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు. ఈ యాత్ర 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంటు నియోజకవర్గాలు చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్‌లో సాగుతుంది. కరీంనగర్‌లో ముగుస్తుంది. 1,217 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

భాగ్యలక్ష్మి క్లస్టర్: భువనగిరిలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో కొనసాగనుంది. నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. హైదరాబాద్‌లో ముగుస్తుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు.

కృష్ణమ్మ క్లస్టర్: మక్తల్ నియోజకవర్గం కృష్ణా గ్రామం నుంచి కొనసాగనున్న బస్సుయాత్రను కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర మూడు పార్లమెంటు నియోజకవర్గాలు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండలో, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నల్లగొండలో ముగుస్తుంది. కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. 1,440 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.

కాకతీయ-భద్రకాళి క్లస్టర్: సమ్మక్క-సారలమ్మ జాతర కారణంగా ఈ యాత్ర రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో, 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్ర సాగనుంది. మొత్తం 1,015 కిలోమీటర్లు కొనసాగుతుంది.

Next Story