బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. ఇరు పార్టీల ఆఫీసుల వద్ద భారీ బందోబస్తు

by Disha Web Desk 2 |
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. ఇరు పార్టీల ఆఫీసుల వద్ద భారీ బందోబస్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో‌: పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రవేశపెట్టడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట శాంతియుతంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఇది కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. బీజేపీలో ఉన్నవారు మాత్రమే హిందువులా? అని మహిళా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. తామూ హిందువులమేనని, చాలీసా పఠనం తమకు కూడా వచ్చని పేర్కొన్నారు. తాము కూడా రాముడిని, హనుమంతుడిని కొలుస్తామన్నారు.

బీజేపీకి హిందుత్వం మాత్రమే తెలుసని, తాము అన్ని మతాలను గౌరవిస్తామని కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దామని వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా బారికేడ్లు దూకి మరీ బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లేందుక ప్రయత్నించారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రోడ్డుపైనే హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. కాగా బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్ గాంధీ భవన్ ఎదుట నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీ భవన్ ప్రధాన గేట్లను పోలీసులు మూసివేశారు. గాంధీ భవన్ గేట్లు ఎందుకు మూశారని మహిళా కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

Next Story

Most Viewed