పహిల్వాన్ అంటే రౌడీ షీటర్లు కాదు.. బీజేపీ నేత విక్రమ్ గౌడ్

by Dishafeatures2 |
పహిల్వాన్ అంటే రౌడీ షీటర్లు కాదు.. బీజేపీ నేత విక్రమ్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పహిల్వాన్ అంటే కబ్జా చేసేవారు, రౌడీ షీటర్లుగా ప్రస్తుతం ముద్ర పడిపోయిందని, వాస్తవానికి ఆ పహిల్వాన్ అనే బిరుదు ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదని బీజేపీ నేత విక్రమ్ గౌడ్ అన్నారు. గోశామహల్ లోని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9వ తేదీ నుంచి దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద క్యాష్ ప్రైజ్ టోర్నీని తెలంగాణలో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోటీలు 12వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టంచేశారు. 12వ తేదీన ఫైనల్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఈ పోటీలో పాల్గొనేందుకు 617 అప్లికేషన్లు వచ్చాయని, దేశవ్యాప్తంగా మొత్తం 1000 దరఖాస్తుల వరకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 17 కేటగిరీల్లో ఈ క్రీడలు కొనసాగుతాయని, 35 లక్షల ప్రైజ్ మనీ అందిస్తున్నట్లు విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు.

అందులో రూ.5 లక్షలు స్కాలర్ షిప్ గా అందిస్తున్నట్లుగా వెల్లడించారు. క్రీడలపై ఇష్టం ఉండి డబ్బులేని నిరుపేదలకు ఈ స్కాలర్ షిప్ అందించి వారికి అండగా నిలుస్తామని, వారికి క్రీడలపై మరింత పట్టు సాధించేలా కృషిచేస్తామన్నారు. శ్రేష్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మల్ల యుద్ధ కాలక్రమేణా రెజ్లింగ్ గా మారిందని, తన తండ్రి కూడా ఒక రెజ్లర్ అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే ఆయన క్రమంగా పైకి ఎదిగారన్నారు. తన తండ్రి నుంచే తనకూ రెజ్లింగ్ అంటే ఇష్టం ఏర్పడిందన్నారు. తన తండ్రి కోరిక, కల నెరవేర్చేందుకు ఈ క్రీడకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆయన స్పష్టంచేశారు.



Next Story

Most Viewed