నిర్వాసితులను ఆదుకోవాలి... లేకపోతే.. : సుగర్తి

by Dishanational1 |
నిర్వాసితులను ఆదుకోవాలి... లేకపోతే.. : సుగర్తి
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణాకాలనీలోని రాజీవ్ స్వగృహకు సంబంధించిన స్థలంలో ప్లాట్ల విక్రయ ప్రయత్నాలను ఆపేయాలని తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ భూములను ప్రభుత్వం ప్లాట్లుగా చేసి విక్రయించే ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం ఆయన భాధితులతోపాటుగా గ్రామస్తులను కలిసి ఆ స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజీవ్ స్వగృహ పేరిట ఎస్సీ, బీసీ రైతుల యొక్క భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బలవంతంగా సేకరించడం జరిగిందని ఆరోపించారు. స్వగృహ ప్రాజెక్ట్ కోసం సేకరించిన సుమారు 90 ఎకరాల భూముల్లో దాదాపు 50 చోట్ల 10గజాలకు పైగా గత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం కోసం తోడినటువంటి పెద్ద పెద్ద గుంతలను నామమాత్రంగా పూడ్చి ప్లాట్లుగా చూపించి సామాన్య ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అలాగే ఈ భూముల్లోనే రెండు చోట్ల స్మశానవాటికల కోసం స్థలాన్ని స్థానిక ప్రజలు పూర్వకాలం నుండే వాడుకుంటున్నారని అట్టి స్మశానంలో కూడా ప్లాట్లను చూపిస్తున్నారని తెలిపారు. ఈ భూములను సేకరించే సమయంలో నిర్వాసితులకు ఒక్కొక్క గుంట చొప్పున స్థలం గానీ లేదా నిర్వాసిత కుటుంబ వ్యక్తికి ఉద్యోగంకానీ ఇస్తామని గత ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు మాట ఇచ్చారని భాధితులు పేర్కొన్నట్లు తెలిపారు. రాజీవ్ స్వగృహ భూములను తిరిగి సదరు నిర్వాసితులకు అప్పచెప్పాలని.. లేదంటే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 90 ఎకరాల సారవంతమైన భూములను అక్రమంగా సేకరించి దొడ్డిదారిన రియల్ వ్యాపారం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, జెడ్పిటీసీ, ఎంపీపీ పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. ఈ విషయంలో నిర్వాసితులకు, గ్రామస్తులకు న్యాయం జరిగేవరకూ బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పండుగ రాజయ్య, సిద్ద శ్రీనివాస్, గంగు కొమురయ్య, అట్ల శ్రీనివాస్, సోల్లెటి శేఖర్, ఆవుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed