ఇక రంగంలోకి కేంద్రమంత్రులు.. ప్రత్యర్థిని చిత్తు చేసేలా బీజేపీ భారీ ప్లాన్!

by Disha Web Desk 2 |
ఇక రంగంలోకి కేంద్రమంత్రులు.. ప్రత్యర్థిని చిత్తు చేసేలా బీజేపీ భారీ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజల అటెన్షన్ మొత్తం ఇప్పుడు మునుగోడుపైనే ఉంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో రాజకీయ పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని షురూ చేశాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు ఎవరి ప్రణాళికలు వారు రచిస్తున్నారు. కాగా బీజేపీ సైతం తన అస్త్రాలను ప్రత్యర్థి పార్టీలపైకి ఎక్కుపెట్టనుంది. కుల సంఘాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అవసరమైతై ప్రచారానికి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతోంది.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ జాతీయ కార్యవర్గాల సీన్‌ను రిపీట్ చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిలైన ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలతో ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రముఖులతో భేటీ నిర్వహించినట్లే మునుగోడులో కూడా కుల సంఘాలకు చెందిన నేతలతో ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కూడా పర్యటించారు. యాదవ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ఫెయిల్యూర్‌పై నిలదీశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దళిత బంధు వంటి పథకాలపై ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని సంఘం నేతలకు తెలిపారు. యాదవ సంఘం నేతలను చైతన్యపరిచినట్లే అక్కడున్న ఓటర్లను ప్రభావితం చేసే నాయకులతో పాటు కుల ప్రాతిపదికన నేతలను తీసుకెళ్లి ప్రచారాన్ని స్పీడప్ చేసి తెలంగాణ సర్కార్‌ను ఓడించేందుకు కాషాయదళం ప్లాన్ చేస్తోంది.

బీజేపీ నేతలు ఇప్పటికే మునుగోడులో తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ ఉంది. కాగా ఆ సమయం నాటికి ప్రతి ఇంటికీ కనీసం మూడు, లేదా నాలుగు సార్లు అయినా ప్రతి గడపకూ వెళ్లి ప్రతీ ఓటరును కలిసి బీజేపీకి ఓటేసేలా ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. హుజురాబాద్‌లో తెలంగాణ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లే ఇక్కడ కూడా పాల్గొనే అవకాశాలున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్, పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకుని ఓటుకు రూ.40 వేలు పంచాలని చూస్తోందని బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా ఇలాంటి అంశాలపై కూడా స్థానిక నేతలు దృష్టిసారించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా స్పెషల్ టీమ్స్‌ను పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. కుల సంఘాలతో ముఖ్య నేతల భేటీలకు అదనంగా శక్తి కేంద్రాల ఇన్ చార్జీల సేవలను సైతం ఈ బైపోల్ కోసం వినియోగించుకోవాలని కాషాయదళం ప్లాన్ చేస్తోంది. ప్రతి ఇంటికీ కనీసం 3 నుంచి 4 సార్లయినా వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న బీజేపీని ప్రజలు ఆదరిస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed