గవర్నర్ మార్పు వెనుక బిగ్ స్కెచ్!.. బీఆర్ఎస్, బీజేపీ వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త గవర్నర్ పై జోరుగా చర్చ

by Prasad Jukanti |
గవర్నర్ మార్పు వెనుక బిగ్ స్కెచ్!.. బీఆర్ఎస్, బీజేపీ వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త గవర్నర్ పై జోరుగా చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌స‌భ‌ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న రాజీనామా నిర్ణయం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్‌గా ఎవరు వస్తారు? ఎప్పుడొస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌కు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపీ ఎన్నికలకు ముందే వస్తారా? లేక ఆ తర్వాతే ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది. అయితే నియామకం ఆలస్యం అయితే తెలంగాణ బాధ్యతలను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌లలో ఎవరికైనా అప్పగించబోతున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్‌గా..

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటే, ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతల మీటింగ్‌లో వ్యాఖ్యానిస్తున్నారనే వార్తలు రావడం సంచలనంగా మారుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ నేతల వరుస కామెంట్ల నేపథ్యంలో అనూహ్యంగా ప్రస్తుత గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడం చర్చకు దారితీస్తోంది.తమ ప్రభుత్వం జోలికి వస్తే సహించేది లేదని ఓ వైపు రేవంత్ రెడ్డి ఫైర్ అవుతుంటే మరో వైపు రాష్ట్రంలో గవర్నర్ మార్పు వెనుక ఎదైనా భారీ వ్యూహం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

లీడరా.. ఆఫీసరా..?

కేసీఆర్‌పై ఉన్న కోపంతో తమిళిసై రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇంతలోనే ఆమె రాజీనామా చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఏమైనా ప్రభావితం అవుతాయా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తలపండిన వ్యక్తిని కొత్త గవర్నర్ పంపిస్తారా లేక న్యాయపరమైన అవగాహన కలిగిన మాజీ ఉన్నతాధికారిని నియమిస్తారా? అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story