ఫాంహౌస్ కేసు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! ఈసారి అసెంబ్లీ టికెట్లు డౌటే?

by Disha Web Desk 4 |
ఫాంహౌస్ కేసు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్!  ఈసారి అసెంబ్లీ టికెట్లు డౌటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌లోని నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే రేగ కాంతరావును బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ నమోదైన కేసు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బీజేపీ కుట్రను బయటపెట్టడంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు చాలా గొప్పగా వ్యవహిరించారని, వారు పార్టీ ఆణిముత్యాలు అంటూ సీఎం కేసీఆర్ స్వయంగా కితాబిచ్చారు. వారిని కొంత కాలం ప్రగతిభవన్‌కే పరిమితం చేశారు.

వారు ఎక్కడికి వెళ్లినా స్పెషల్ ప్రొటెక్షన్‌తోపాటు బుల్లెట్ ప్రూఫ్ కారు సౌకర్యం కల్పించారు. ఈ వ్యవహారంతో సీఎం కేసీఆర్‌కు ఆ నలుగురు ఎమ్మెల్యేలు దగ్గరైనా.. ప్రజల్లో మాత్రం వారి గ్రాఫ్ పడిపోతున్నట్టు తెలుస్తున్నది. వారి సొంత నియోజకవర్గాల్లో ఎన్ని సార్లు సర్వే నిర్వహించిన నెగిటివ్ రిపోర్టులే వస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో వీరిపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్నదని టాక్. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ ఇస్తే గెలవడం కష్టమనే ప్రచారం జరుగుతున్నది. ఫలితంగా సీఎం కేసీఆర్ అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది.

అటు వ్యతిరేకత.. ఇటు సొంత కుంపటి సమస్య

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో పాటు సొంత పార్టీ లీడర్లతో సఖ్యత లేకపోవడం పెద్ద సవాలుగా మారినట్టు టాక్. రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే తాము పార్టీ కోసం పనిచేయలేమని పట్నం వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌కు టికెట్ ఇస్తే పార్టీని నష్టం జరిగే ప్రమాదముందని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి సైతం ఇలాగే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన పట్ల స్థానికంగా నెగిటివ్ ఫీలింగ్ ఉందని, ఆయన వ్యవహర తీరే ఇందుకు ప్రధాన కారణమనే ప్రచారం కొనసాగుతున్నది. దానికి తోడు నాగర్ కర్నూలు ఎంపీ రాములు వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్నదని, దీని వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని టాక్.

కొల్లాపూర్, పినపాక‌లోనూ సవాళ్లు

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్టు తెలుస్తున్నది. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతరావుకు సైతం ఇదే పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన తిరుగుబాటుదారుల ప్రభావం మరింతగా పడే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. కొల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ఇప్పటికే ప్రకటించారు.

ఎలాగైనా హర్షవర్ధన్‌రెడ్డిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మరోవైపు పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గెలిపించుకునేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. మరి ఈ నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగులనే కొనసాగిస్తుందా? లేక పక్కనపెడుతుందా? కొత్త వారికి ఎవరికైనా చాన్స్ ఇస్తుందా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి.


Next Story

Most Viewed